గర్దాస్‌ రమేష్‌పై పీడీ యాక్ట్‌

PD Act File on Gardas Ramesh - Sakshi

‘కాయిన్‌ క్రైమ్స్‌’ చేసిన అంతరాష్ట్ర మోసగాడు

మూడు రాష్ట్రాల్లో 18 కేసులు ఉన్నట్లు గుర్తింపు

సాక్షి, సిటీబ్యూరో: కాయినెక్స్‌ ట్రేడింగ్‌ పేరుతో విదేశాల నుంచి నిర్వహిస్తున్నట్లు ఓ నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి, దళారులను ఏర్పాటు చేసుకుని వందల మందిని రూ.కోట్లలో మోసం చేసిన అంతరాష్ట్ర మోసగాడు గర్దాస్‌ రమేష్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ నగరపోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇతడిపై మూడు రాష్ట్రాల్లో మొత్తం 18 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నగరంలో కాయినెక్స్‌ ట్రేడింగ్‌ పేరుతో దందా చేసిన రమేష్‌ తమ స్కీముల్లో పెట్టుబడి పెడితే కనిష్టంగా 134 రోజుల నుంచి గరిష్టంగా 500 రోజుల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుందని ప్రచారం చేసుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 1200 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి నిండా ముంచాడు. ఈ నేపథ్యంలోనే ప్రధాన సూత్రధారి రమేష్‌తో సహా ఐదుగురు నిందితులను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత ఏడాది ఆగస్టు 24న అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా, దొనకొండకు చెందిన రమేష్‌ 1999 నుంచి వివిధ రకాలైన స్కీముల పేరుతో జనాలను ముంచడమే పనిగా పెట్టుకున్నాడు.

అప్పట్లో గ్లోబల్‌ ఆగ్రో ఫామ్స్‌ ముసుగులో టేకుచెట్ల ప్లాంటేషన్‌ పేరుతో రూ.5 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ఆపై 2013లో గోల్డెన్‌ ఫారెస్ట్‌ కంపెనీ ఏర్పాటు చేసి తన వద్ద రూ.5 వేలు పెట్టుబడిపెడితే ఎనిమిదేళ్ల తర్వాత రూ.50 వేలు ఇస్తానంటూ వసూలు చేసి మోసం చేశాడు. ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన బిట్‌ కాయిన్‌ పేరు చెప్పి మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌కు (ఎంఎల్‌ఎం) పాల్పడాలని పథకం వేశాడు,. బోయిన్‌పల్లిలో జీఆర్‌ఎం ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేసి తమ ద్వారా బిట్‌కాయిన్స్‌లో 100 అమెరికన్‌ డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చని, 4 శాతం నుంచి 10 శాతం వరకు బోనస్‌ రావడంతో పాటు కనిష్టంగా 134 రోజుల నుంచి గరిష్టంగా 500 రోజుల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుందని ప్రచారం చేసుకున్నాడు. ఇతడి మోసాల చిట్టా పెరిగిపోవడంతో గతేడాది టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. గర్దాస్‌ రమేష్‌ కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌కు పాల్పడ్డాడు. మూడేళ్ల క్రితం కేసు నమోదు చేసిన అక్కడి అశోక్‌నగర్‌ పోలీసులు రమేష్‌తో పాటు ముగ్గురు హైదరాబాదీయులను అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌ తీసు కున్న రమేష్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఇతడిపై నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. అతడి ఆచూకీ తెలుసుకున్న వచ్చిన బెంగళూరు పోలీసులు గత నెల్లో అరెస్టు చేసి తీసుకెళ్లారు. రమేష్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో రిజిస్టర్‌ అయిన కేసుల సంఖ్య 18కి చేరింది. వీటిని పరిగణలోకి తీసుకున్న సీపీ అతడిపై పీడీయాక్ట్‌ ప్రయోగించారు. దీంతో ఏడాది కాలం అతడు జైల్లోనే ఉండనున్నాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top