చికిత్స కోసం వచ్చి కన్ను‘మూసింది’ | patient died in railway station | Sakshi
Sakshi News home page

Dec 17 2017 7:27 PM | Updated on Sep 28 2018 3:41 PM

వరంగల్‌: రాత్రి తమతోనే నిద్రించింది.. తెల్లారేసరికి విగతజీవిగా మారింది.. తన భార్య ఈ లోకం విడిచిందని తెలుసుకున్న భర్త అమ్మ చనిపోయిందని పిల్లలకు చెప్పలేక చెప్పాడు. ఇంకా నిద్రలోనే ఉందనుకుని అమ్మా నిద్ర లేమ్మా అంటున్నవారి పిలుపు అక్కడి వారి హృదయాలను ద్రవింపజేసింది. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని మంచుకొండకు చెందిన భూక్యా జ్యోతి(32) అనారోగ్యంతో బాధపడుతోంది.  చికిత్స నిమిత్తం తన ఇద్దరు పిల్లలతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు పూర్తయినట్లు తెలుపడంతో భర్త రఘుపతి వరంగల్‌ వచ్చాడు. తమ గ్రామం వెళ్లేందుకు రాత్రి 10 గంటలకు వారంతా వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సమయానికి రైళ్లు లేకపోవడంతో జనరల్‌ వెయిటింగ్‌ హాల్‌లో నిద్రించారు. తెల్లవారుజామున అందరినీ లేపేందుకు ప్రయత్నించగా జ్యోతి చనిపోయిందని తెలుసుకుని రఘుపతి బోరున విలపించాడు. అమ్మ చనిపోయిందన్న విషయం పిల్లలకు చెప్పడంతో వారు దీనంగా రోదిస్తూ అమ్మా లేమ్మా అంటూ పిలుస్తున్నారు. అక్కడున్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఈ సంఘటనతో కంట తడిపెట్టారు. వారందరి సహకారంతో జ్యోతి మృతదేహాన్ని తన గ్రామానికి తీసుకెళ్లాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement