మాకొద్దీ.. పుష్‌పుల్‌

Passengers Facing Lack Of Facilities With Push Pull Train In Karimnagar - Sakshi

సౌకర్యాల లేమితో తప్పని తిప్పలు 

ఇబ్బందులు పడుతున్న మహిళలు 

సాక్షి, ఓదెల: భద్రాచలం రోడ్డు నుంచి సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌ల మధ్య నడిచే పుష్‌పుల్‌ రైలుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని సింగరేణి కార్మికుల సౌకర్యార్థం ప్రారంభించిన సింగరేణి రైలు బోగీలను మార్చి ప్రస్తుతం పుష్‌పుల్‌ రైలును నడపుతున్నారు. రెండునెలలుగా సింగరేణి రైలు బోగీలను మార్చి ఎలాంటి సౌకర్యాలు లేని పుష్‌పుల్‌ను ఏర్పాటు చేయటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.

భద్రాచలం నుంచి సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌ల మధ్య అనేక మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. మూత్రశాలలు, మరగుదొడ్లులేని పుష్‌పుల్‌ బోగీలను ఏర్పాటు చేయటంతో రైలులో ప్రయాణించేవారు ఒంటికి రెంటికి వస్తే రైలు దిగాల్సివస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరీ దారుణం. సింగరేణి రైలుకు బోగీలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు సులువుగా గమ్యం చేరేవారు. ప్రస్తుతం 12 బోగీలు మాత్రమే ఏర్పాటు చేయటంతో ప్రయాణికులు ప్రయాణం చేయలేకపోతున్నారు. ఒకవైపు మరుగుదొడ్ల లేమి, మరోవైపు బోగీలు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రయాణం చేయటానికి బెంబేలెత్తుతున్నారు. 

మాకొద్దీ రైలు.. 
ఓదెల, పెద్దపల్లి, పొత్కపల్లి, కొలనూర్, మంచిర్యాల, జమ్మికుంట రైల్వేస్టేషన్లలో ఎక్కే ప్రయాణికులు ‘మాకొద్దు ఈ పుష్‌పుల్‌ రైలు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దపల్లి, రాంగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలో సింగరేణి కార్మికులు సింగరేణి రైలును యధావిధిగా నడపాలని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. 50 ఏళ్లుగా నడస్తున్న సింగరేణి రైలును మార్చటం ఏంటని విద్యార్థులు, సీనియర్‌ సిటిజన్స్‌ రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాత బోగీలతో సింగరేణి రైలును పునరుద్ధరించాలని ప్రయాణికులు కొరుతున్నారు. 

పట్టించుకోని ప్రజాప్రతినిధులు. 
రెండునెలల నుంచి నడస్తున్న ఎలాంటి సౌకర్యాలు లేని పుష్‌పుల్‌ను రద్దు చేయాలని ప్రయాణికులు, సింగరేణి కార్మికులు కోరుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కావున ప్రజాప్రతినిధులు దృష్టిసారించి సింగరేణి రైలును పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top