తేలిన లెక్క | Party Tickets Confirmed To TDP In Hyderabad | Sakshi
Sakshi News home page

తేలిన లెక్క

Nov 6 2018 10:23 AM | Updated on Mar 22 2019 6:25 PM

Party Tickets Confirmed To TDP In Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రజా కూటమిలో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. గ్రేటర్‌లోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాల్లో 10 స్థానాల్లో టీడీపీ, తెలంగాణ జన సమితి పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. నగరంలో టీడీపీకి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఖైరతాబాద్‌తో పాటు హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మరో రెండు నియోజకవర్గాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. ఇవి కాకుండా అంబర్‌పేట, సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో ఒక స్థానం, రాజేంద్రనగర్, పటాన్‌చెరులో ఒక స్థానం టీడీపీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మహేశ్వరం, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, గోషామహల్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కంటోన్మెంట్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే పోటీ చేయనున్నారు. తెలంగాణ జనసమితికి మల్కాజిగిరితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో రెండు స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, టీడీపీ కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, ఉప్పల్‌తో పాటు సనత్‌నగర్, పటాన్‌చెరు, అంబర్‌పేట స్థానాల కోసం పట్టుపడుతోంది. ఇందులో సనత్‌నగర్‌ స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా లేనట్లు సమాచారం. 

నిరాశావహులకు ఢిల్లీ పిలుపు
ప్రజా కూటమి పొత్తులో భాగంగా పోటీ చేసే అవకాశం కోల్పోతున్న మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు పీసీసీ నాయకులు నగరంలోని ముఖ్య నేతలను ఢిల్లీ తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అధికారంలోకి వస్తే తప్పక న్యాయం చేస్తామన్న హామీని ఇప్పించనున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత స్థానికంగా నిరసనలు తలెత్తకుండా చూడడంతో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసేలా ఏఐసీసీ చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే నగరంలో లోక్‌సభ నియోజకవర్గాల వారిగా విధులు నిర్వహిస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ పీసీసీతో పాటు ఏఐసీసీకి నివేదించేలా కార్యాచరణ రూపొందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement