అభ్యర్థులకోసం అన్వేషణ

Parties Planning To Recruit Winning Horses For Panchayat Elections - Sakshi

రిజర్వేషన్‌ ఏదైనా అనుకూల వ్యక్తులను రంగంలోకి దింపేందుకు కసరత్తు

కులం, మతం, డబ్బు, ప్రజలతో వారికున్న సంబంధాలూ పరిగణలోకి..

సవాల్‌గా మారిన అభ్యర్థుల ఎంపిక

‘స్థానిక’ ఎన్నికలకు ఓటరుజాబితా సిద్ధం చేయాలని యంత్రాంగానికి ఆదేశాలు

ఊపందుకున్న గ్రామ రాజకీయాలు

సాక్షి, యాదాద్రి : నూతన పంచాయతీల ఏర్పాటు కొలిక్కిరావడంతో పాటు కొత్త పంచాయతీరాజ్‌ చట్టం గెజిట్‌ విడుదల,  ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధి కార యంత్రాంగానికి ఆదేశాలు అందిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు పల్లెపోరుకు సమాయాత్తం అవుతున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకోసం యంత్రాంగం కసరత్తు చేస్తుండడంతో ఆయా పార్టీల్లో జోష్‌ నెలకొంది. భవిష్యత్‌ వ్యూహంపై క్షేత్రస్థాయిలో కేడర్‌ బలోపేతానికి  తమ కార్యక్రమాలు ముమ్మరం చేశాయి. ఇదే సమయంలో ఎన్నికల బరిలో నిలిపేందుకు సమర్థులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. మరో వైపు స్థానిక సీట్లపై కన్నేసిన నాయకులు ఆయారామ్‌ గయారామ్‌ అవుతున్నారు. ప్రధాన పార్టీల్లోకి వలసలు ఊపందుకుంటున్నాయి.
 
ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు
జిల్లాలో ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉండగా మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్‌ నియోజకవర్గాల ప్రాతినిథ్యం కూడా ఉంది.  వీటి పరిధిలో 16 మండలాలు విస్తరించి ఉన్నాయి. ఆయా మండలాల్లో కొత్తవి, పాతవి కలుపుకుని మొత్తం 401 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.  అయితే మరో ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

అభ్యర్థుల ఎంపికకు కసరత్తు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో 401 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. ఆగస్టు 1వ తేదీతో పాలకవర్గాల పదవీ కాలం  ముగి యనుంది.ఈ లోపే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో యం త్రాంగం కూడా అందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీ ఐ, సీపీఐఎంఎల్‌ న్యూడెమొక్రసీతో పాటు తెలంగాణ జన సమితి వంటి పార్టీలు స్థానిక ఎన్ని కల బరిలో నిలిపేందుకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించా యి.

ఆయా వ్యక్తుల గుణగణాలు, కులం, మతం, డబ్బు, స్థానిక ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, ఎదుటి పార్టీ అభ్యర్థిని ఓడించగలిగే శక్తి సామర్థ్యాలను పరిశీలిస్తున్నాయి. అయితే ఈసారి గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు మారే అవకాశం ఉన్నం దున అం దుకు అనుగుణంగా తమ అభ్యర్థిని రంగంలో దింపే పనిలో ఆయా పార్టీ ల నేతలు ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇటీవల జిల్లాలోని ఓ ప్రధాన రాజకీ య పార్టీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించా ల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థులను ఎంపిక చేయడం ఆయా పార్టీల నేతలకు సవాల్‌గా మారింది.

సర్పంచ్‌లే కీలకం
సహజంగా సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందాలంటే గ్రామ స్థాయిలో సర్పంచ్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ తరఫునైనా మెజార్టీ సర్పంచ్‌లు ఉంటే సాధారణ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే, ఎంపీలుగా అలవోకగా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ సార్లు విజయం సాధిస్తారు. ఇందుకోసం తమ ముఖ్య అనుచరులను గెలిపించుకునే దిశగా ప్రధాన పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు.

ఆశావహుల్లో హుషార్‌..
సర్పంచ్‌ కావాలని కలలు కంటున్న స్థానిక నేతల్లో హుషారు పెరుగుతోంది. త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు కనిపిస్తుండడంతో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రజలతో మరింత సత్సంబంధాలు పెంచుకోవడానికి అన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ తమ పలుకుబడి పెంచుకునే యత్నం చేస్తున్నారు.

విందు, వినోదాలు, విహారయాత్రలు, ఆర్థిక సాయం చేయడానికి సైతం వెనుకాడడం లేదు. ఇదే క్రమంలో తమ పార్టీల పెద్దలను  సీటు సంపాదించే పనిలో పడ్డారు. ఏది ఏమైనా స్థానిక సంస్థలకు త్వరలో జరగబోయే ఎన్నికలు స్థానిక నాయకుల కంటే ప్రధాన పార్టీలకే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top