పాలన ఇక గాడిలో..

Panchayat Secretary Notification Green Signal - Sakshi

అశ్వాపురం: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకానికి లైన్‌క్లియర్‌ అయింది. నియామకాలకు ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్యదర్శుల పోస్టుల ఎంపికలో పారదర్శకత పాటించలేదంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో నియామకాలు నిలిచిపోయాయి. జిల్లాలో 479 పంచాయతీలు ఉండగా 387 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలో ఈ మొత్తం పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.

డిసెంబర్‌లోనే సర్టిఫికెట్ల పరిశీలన...  
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసి,  అక్టోబర్‌ 10న రాత పరీక్ష నిర్వహించింది. ఉత్తీర్ణత సాధించిన వారి మార్కుల ఆధారంగా జాబితా ప్రకటించారు. డిసెంబర్‌ 20న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. ఆ నెలలోనే పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో నియామకాలు వాయిదా పడ్డాయి.

ఆ తర్వాత మళ్లీ నియామకాలు చేపట్టాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. పంచాయతీ ఎన్నికల కోడ్‌ రావడంతో ఈ  ప్రక్రియ మరింత ఆలస్యమైంది. జనవరి 31న పంచాయతీ ఎన్నికల కోడ్‌ ముగియడంతో నియామకాలు చేపడతారని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రావడంతో ఇక ఇప్పట్లో నియామక ప్రక్రియ ఉండదని అభ్యర్థులు ఆందోళన చెందారు. అయితే ఎట్టకేలకు ఎన్నికల సంఘం నియామక ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలో తమకు కొలువులు దక్కుతాయని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కార్యదర్శుల కొరతతో కుంటుపడిన పాలన... 
ఫిబ్రవరి 2న జిల్లాలోని 479 పంచాయతీలలో నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టినా.. పంచాయతీ కార్యదర్శుల కొరతతో పాలన కుంటు పడింది. జిల్లాలో 479 పంచాయతీలలో 92 మంది మాత్రమే పంచాయతీ కార్యదర్శులు ఉండటంతో ఒక్కొక్కరు నాలుగు, ఐదు పంచాయతీలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడే పేరుకుపోయాయి. కార్యదర్శులు లేకపోవడంతో నూతన పాలకవర్గాలు సైతం తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు, పంచాయతీ నిర్వహణ, ఇంటి పన్నుల వసూలు, వీధిలైట్లు, జనన, మరణ ధ్రువపత్రాల జారీ తదితర పనుల విషయంలో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాయి.

ఇంకా ఆదేశాలు రాలేదు 
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. కానీ మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లాలో 387 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నియామకాలకు సంబంధించి పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.  – ఆర్‌.ఆశాలత, డీపీఓ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top