బుజ్జగింపులు  | Panchayat Polls Second Phase Nominations Nizamabad | Sakshi
Sakshi News home page

బుజ్జగింపులు 

Jan 12 2019 10:50 AM | Updated on Jan 12 2019 10:50 AM

Panchayat Polls Second Phase Nominations Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం షురువైంది. నామినేషన్ల ఉప సంహరణకు గడువు రేపటితో ముగియనుండటంతో నామినేషన్లు వేసిన వారిని బరిలోంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న గ్రామ పంచాయతీల్లో కొన్నింటికి ఒకే ఒక నామినేషను దాఖలు కావడంతో ఈ పంచాయతీలు ఏకగీవ్రమైనట్లే. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.

తొలి విడతలో ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 177 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ స్థానాలకు, 1,746 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గం పరిధిలో నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచ్‌ స్థానాలకు ఒకే ఒక నామినేషన్‌ చొప్పున దాఖలయ్యాయి. దీంతో ఈ నాలుగు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య సుమారు 10 నుంచి 14 వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్మూర్‌ నియోజకవర్గంలో కూడా నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరగనుంది. నిజామాబాద్‌ రూరల్‌ పరిధిలోని జక్రాన్‌పల్లి మండలంలో ఇప్పటికే రెండు చోట్ల ఏకగ్రీవం కాగా, మరికొన్ని గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవం వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

‘మేజర్‌’పై ఎమ్మెల్యేల దృష్టి.. 
మేజర్‌ గ్రామ పంచాయతీలపై ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పంచాయతీలు దాదాపు తమ అనుచరులకే దక్కేలా చూస్తున్నారు. నామినేషన్లు వేసిన బలమైన అభ్యర్థులకు అవసరమైతే సహకార ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. సహకార సం ఘం డెరెక్టర్‌ స్థానానికి మద్దతిస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానానికి అవకాశం కల్పిస్తామని బుజ్జగిస్తున్నారు.

వార్డు సభ్యులకూ పోటీ.. 
సర్పంచ్‌ స్థానాలకే కాకుండా వార్డు సభ్యుల స్థానాలకు కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మేజర్‌ పంచాయతీల్లో ఈ పోటీ అధికంగా కనిపిస్తోంది. నందిపేట్‌ మేజర్‌ గ్రామ పంచాయతీలోని ఓ వార్డుకు ఏకంగా 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారంటే వార్డు సభ్యులకు సైతం ఏ స్థాయిలో పోటీ ఉందో అర్థం అవుతోంది.అవకాశం వస్తే ఉప సర్పంచ్‌ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవచ్చనే ఉద్దేశంతో కొందరు వార్డు సభ్యునిగా బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుల సంఘాలు వార్డు సభ్యుల ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా జనరల్‌గా స్థానాలుగా ప్రకటించిన వాటిలో కొన్ని చోట్ల కులాల మధ్య పోటీ నెలకొంది. బలమైన సామాజికవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా బరిలోకి దిగుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement