లంగాణలో కరువు విలయంతాండవం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఏసీలో గదుల నుంచి బయటకొచ్చి గ్రామాల్లో పర్యటిస్తే కరువు కనిపిస్తుందన్నారు.
కరీంనగర్/హుస్నాబాద్/బెజ్జంకి : తెలంగాణలో కరువు విలయంతాండవం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఏసీలో గదుల నుంచి బయటకొచ్చి గ్రామాల్లో పర్యటిస్తే కరువు కనిపిస్తుందన్నారు. కరువు పరిస్థితులు, రైతుల దుస్థితిని సీఎంకు చూపించడానికి తాను సిద్ధమన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుస్నాబాద్, బెజ్జంకిలో పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. వేసవిలో భయంకరమైన తాగునీటి ఎద్దడి రానుందని, దీని నివారణకు సర్కారు ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు.
నిజాం కాలం నాటి లోపభూరుుష్టమైన రెవెన్యూ చట్టాలే ఇంకా అమల్లో ఉండడం బాధకరమన్నారు. మూడు దశాబ్దాలు పోరాటం చేసి సాధించుకున్న ఎస్సారెస్పీ వరదకాల్వకు బడ్జెట్ రూ. 200 మాత్రమే కేటారుుంచారని, అరకొర కేటారుుంపులతో కాల్వ పూర్తికావడానికి ఎన్నోళ్లు పడుతుందని నిలదీశారు. ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ ఇప్పటిదాకా ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఉస్మానియా విద్యార్థులు ఉద్యోగాల కోసం ఆందోళనలు చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కేంద్రప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 40 డాలర్లు పడిపోయినా పెట్రో, డీజీల్ ధరలను ఎందుకు దించలేదని ప్రశ్నించారు. రైతుల పొట్టగొట్టే విధంగా ఉన్న భూ సేకరణ చట్టాన్ని రద్దు చేయూలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నుంచి సీపీఐ అధ్వర్యంలో గ్రామాల్లో రైతులు, కూలీల సమస్యలపై, సాగు, తాగు నీటి ప్రాజెక్టులపై, భూ ఆక్రమణలపై అధ్యయనం చేస్తామన్నారు. మేలో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. జూన్ నుంచి ప్రజా సమస్యలు, ప్రాజెక్టులు, భూ పంపిణీపై దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 25 నుంచి 29 వరకు పాండిచ్చేరిలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగుతాయన్నారు.
నా సంపాదనపై విచారణకు సిద్ధం
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తనపై మర్రి వెంకటస్వామి తప్పుడు ఆరోణలు చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శమని చాడ వెంకటరెడ్డి అన్నారు. తన సంపాదనపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. మర్రిని సీపీఐ జిల్లా కార్యదర్శిగా నియమించింది తానేనే విషయాన్ని మరిచి, ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని, బయటకు వెళ్లిన వారికే రాజకీయ జీవితం ఉండదని అన్నారు. రాష్ర్ట కార్యదర్శిని విమర్శించి పార్టీని వీడిన వెంకటస్వామిని సీపీఎంలోకి తీసుకోవడంపై అలోచించుకోవాలన్నారు.