సిరిచేల మురి‘‘పాలమూరు’’ | Palamuru Top In Farming In Telangana | Sakshi
Sakshi News home page

సిరిచేల మురి‘‘పాలమూరు’’

Sep 13 2019 3:48 AM | Updated on Sep 13 2019 6:41 AM

Palamuru Top In Farming In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాలమూరు.. అంటే వలసలు, కరువు, పడావు భూములు, పొలాలనిండా పల్లెర్లు. దుక్కు లు దున్ని దిక్కులు చూసే దుస్థితి. ఇది ఒకప్పటి దృశ్యం! ఇప్పుడు ఆ దృశ్యం.. అదృశ్యమైంది. పాలమూరు పచ్చబడింది. పడావుభూములకు ప్రాణం వచ్చింది. పంటలు దండిగా పండుతున్నాయి. జిల్లాలో పంటల సాగు నానాటికీ పెరుగుతోందని సామాజిక ఆర్థిక సర్వే– 2019 చెపుతోంది. ప్రస్తుత జిల్లా ప్రకారం చూసినా, ఉమ్మడి జిల్లా ప్రకారం చూసినా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సాగుకు యోగ్యమైన భూమిలో అత్యధిక శాతం భూమి సాగులోకి వచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న సాగుకు యోగ్యమైన భూమిలో 2017–18 సంవత్సరంలో 91 శాతం సాగు చేయగా, జోగులాంబ గద్వాల జిల్లాలో అయితే ఏకంగా 96% భూమి సాగయింది. చెరువులను నింపడం, బోరుబావుల కింద నీటి లభ్యత పెరగడమే దీనికి కారణమని గణాంకాలు చెబుతు న్నాయి. ఎకరాలవారీగా చూస్తే రాష్ట్రంలోనే అత్యధి కంగా ప్రస్తుత నల్లగొండ జిల్లాలో అత్యధికంగా పంటలు సాగవుతున్న భూములున్నాయి. 



ఎలా చూసినా పాలమూరే...!
జిల్లాలవారీగా పరిశీలిస్తే రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్‌ జిల్లాలో సాగుకు యోగ్యమైన భూమి సద్వినియోగం అవుతోందని సర్వే చెపుతోంది. ఈ జిల్లాలో మొత్తం 2.1 లక్షల హెక్టార్లలో సాగు యోగిత భూమి ఉండగా, అందులో 2.03 లక్షల హెక్టార్లలో పంటలు పండిస్తున్నారు. అంటే సుమారు 7 వేల హెక్టార్లు (16వేల ఎకరాల్లో) మాత్రమే నిరుపయోగంగా ఉంది. ఆ తర్వాత పాలమూరుదే హవా. జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా వికారాబాద్‌కు ధీటుగా 96 శాతం భూమి సాగవుతుండగా, మహబూబ్‌నగర్‌లో 91.9 శాతం, వనపర్తిలో 88.9, నాగర్‌కర్నూలులో 82.2 శాతం భూముల్లో దుక్కులు దున్నారు. సగటున చూస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న సాగుకు యోగ్యమైన భూమిలో 91 శాతం భూమి సాగవుతుండడం గమనార్హం. 



ఉత్తర తెలంగాణలో తక్కువ
అతి తక్కువ భూమి సాగుకు వినియోగిస్తున్న జిల్లాల్లో కరీంనగర్‌ ముందు వరుసలో ఉంది. ఇక్కడ 1.8 లక్షల సాగు భూమి అందుబాటులో ఉండగా, కేవలం 1.14 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలున్నాయి. మిగిలిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ 2లక్షల హెక్టార్లలోపే సాగుభూమి అందుబాటులోకి వచ్చిందని సర్వే చెపుతోంది. 



ఎకరాల వారీగా ఆ నాలుగు టాప్‌
పంటలు సాగవుతున్న భూమి విస్తీర్ణం వారీగా చూస్తే నల్లగొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అత్యధికంగా పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 3.74 లక్షల హెక్టార్లలో, మహబూబ్‌నగర్‌లో 3.08, సంగారెడ్డిలో 2.72, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 2.46 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఆయా జిల్లాల్లో సాగుకు యోగ్యమైన భూమి కూడా 4.44 లక్షల నుంచి 2.93 లక్షల హెక్టార్ల వరకు అందుబాటులో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement