మన విద్యుత్‌ విధానం దేశానికే ఆదర్శం

Our electricity system Is the Ideal of the country - Sakshi

‘తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ విజయం’ పుస్తకం ఆవిష్కరణలో సీఎస్‌ ఎస్‌కే జోషి 

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ నాయకత్వం లో తక్కువ సమయంలోనే తెలంగాణ విద్యుత్‌ రంగంలో సాధించిన విజయాలు అనితర సాధ్యమైనవని, ఈ విజయాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిమ్మ చీకట్ల నుంచి నిరంతర వెలుగుల వైపు ఎలా ప్రయాణించిందనేది ఇతర రాష్ట్రాల కు ఒక పాఠంలా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ పీఆర్వోగా పనిచేస్తు న్న ట్రాన్స్‌కో జీఎం గటిక విజయ్‌ కుమార్‌ తెలుగులో ‘తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ విజయం’, ఇంగ్లిష్‌లో ‘ద సాగా ఆఫ్‌ సక్సెస్‌ ఆఫ్‌ తెలంగాణ పవర్‌ సెక్టార్‌’ పుస్తకాలను రచించా రు. ఈ 2 పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మతో కలిసి ఎస్‌కే జోషి సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌ లోని ఐటీసీ కాకతీయలో జరిగిన కార్యక్రమం లో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభా కర్‌ రావు, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహరావు, పుస్తక రచయిత గటిక విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.  

పుస్తకంలో ఏముంది? 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడున్న విద్యుత్‌ సంక్షోభం, ఏపీ చేసిన కుట్రలు, వాటన్నింటినీ అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాలు, విద్యుత్‌ విషయంలో సాధించిన రికార్డులు, తలసరి విద్యుత్‌ వినియోగం, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అంశాల్లో అగ్రగామిగా నిలవడానికి కారణాలు, ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ తదితర బృహత్తర పథకాల్లో విద్యుత్‌ శాఖ బాధ్యతలు, బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యుత్‌ రంగం ఎంతటి కీలక భూమిక పోషిస్తున్నది తదితర అంశాలన్నింటినీ ఈ పుస్తకాల్లో వివరించారు. పుస్తక రచయిత విజయ్‌ కుమార్‌ను కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా అభినందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top