కాటికి పంపేవారే కరువయ్యారు! | Old Woman Died Due To Health Problems At Kodad | Sakshi
Sakshi News home page

కాటికి పంపేవారే కరువయ్యారు!

Jul 21 2020 2:29 AM | Updated on Jul 21 2020 5:08 AM

Old Woman Died Due To Health Problems At Kodad - Sakshi

కారులో మృతదేహాన్ని తరలిస్తున్న మనుమడు 

కోదాడ: కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తుందో నిరూపించే విషాద ఉదంతమిది. ఊరంతా బలగం ఉన్నా.. కనీసం కడసారి చూపునకైనా కన్నెత్తి చూసినవారు కానరాలేదు. కాటికి సాగనంపడానికి.. పాడెమోసేందుకు నలుగురు బంధువులు కరువయ్యారు. దీంతో కరోనా వ్యాధితో ఇబ్బంది పడుతున్న మనుమడు పుట్టెడు కష్టంలో ఒక్కడే నాయనమ్మను కారులో కాటికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లా మునగాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు కుమారులు చనిపోయారు. దీంతో ఆమె కొద్దిరోజులుగా రెండో కుమారుడి కొడుకు (మనుమడి) వద్ద ఉంటోంది. అనారోగ్యంతో ఆదివారం ఆమె మృతిచెందింది.

ఇదే సమయంలో ఆమె మనుమడు వేరేచోట కరోనా పాజిటివ్‌తో హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో వృద్ధురాలి మృతదేహాన్ని చూసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. గ్రామానికి చెందిన కొందరు ఈ విషయాన్ని మనుమడికి చెప్పగా, తన పరిస్థితిని వివరించి బోరున విలపించాడు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక గ్రామానికి చెందిన నలుగురు పెద్దలు అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. రాత్రి 7 గంటల సమయంలో పాజిటివ్‌తో ఇబ్బంది పడుతున్న మనుమడు పీపీఈ కిట్‌ ధరించి కారులో ఇంటికి వచ్చి మృతదేహాన్ని ఒక్కడే కారులోకి చేర్చాడు. అదే కారును నేరుగా శ్మశానం వద్దకు తీసుకెళ్లి నాయనమ్మ అంత్యక్రియలు నిర్వహించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement