ఓడీఎఫ్‌..డబుల్‌ ప్లస్‌

ODF Double Plus Award to Hyderabad in Swachh Bharat Mission - Sakshi

‘స్వచ్ఛత’లో నగరానికి అరుదైన గుర్తింపు

ఉత్తమ ర్యాంకు ప్రకటించిన స్వచ్ఛభారత్‌ మిషన్‌

ఈ ర్యాంకు నిలుపుకునేందుకు కృషి

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌

సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛత’ విషయంలో నగరానికి అరుదైన గుర్తింపు లభించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ హైదరాబాద్‌ను ‘ఓడీఎఫ్‌ (ఓపెన్‌ డిఫకేషన్‌ ఫ్రీ) డబుల్‌ ప్లస్‌’గా ప్రకటించింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూర్‌ వంటి ఏ మెట్రో నగరానికీ ఇలాంటి అవార్డు రాలేదు. నగరానికి ప్రస్తుతం లభించిన ఓడీఎఫ్‌ డబుల్‌ప్లస్‌ గుర్తింపు శాశ్వతంగా ఉండేందుకు ప్రజల సహకారం అవసరమని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ కోరారు. దేశంలో ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్‌కు ఎంపికైన మూడు నగరాల్లో హైదరాబాద్‌లోనే ఎక్కువ జనాభా ఉందని, మన జనాభా కోటి కాగా, మిగతా రెండు నగరాలైన ఇండోర్, చండీగఢ్‌ల జనాభా 20 లక్షలపైచిలుకు మాత్రమేనన్నారు. ఈ గుర్తింపు ఎప్పటికీ కొనసాగేందుకు ప్రజలకు తగిన అవగాహన కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను ఫిబ్రవరి మొదటి వారం నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవార్డు ప్రకటన సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్కి సహకారంతో గత రెండు నెలలుగా జీహెచ్‌ఎంసీ, జలమండలి పరస్పర సహకారంతో పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.

నగరంలో ప్రస్తుతమున్న టాయ్‌లెట్లు సరిపోవని, మరిన్ని పబ్లిక్‌ టాయ్‌లెట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తద్వారా మున్ముందు ఈ ర్యాంక్‌ కోల్పోకుండా ఉంటామన్నారు. దీంతోపాటు నానో వాహనం ద్వారా ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్‌ చేయడం ద్వారా ఎక్కడైనా బహిరంగ మూత్రవిసర్జన జరిగితే గుర్తించి, జరిమానా విధింపు వంటి చర్యలు చేపడతామన్నారు.  నిబంధనలు పాటించడం, తదితర అంశాలపై ప్రజలకు తగిన అవగాహన ఉంటేనే క్లీన్‌ అండ్‌గ్రీన్‌సిటీ వంటివి సాధ్యమంటూ, అందుకుగాను అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు.  నగరంలో 9వేల కి.మీ.ల రహదారులుండగా, ప్రధాన రహదారులపై, బస్టాండ్లు, ఆటోస్టాండ్లు తదితర ప్రాంతాల్లో తప్పనిసరిగా పబ్లిక్‌ టాయ్‌లెట్లు ఉండాలన్నారు.

వీలైనన్ని ఎక్కువ ప్రదేశాల్లో పబ్లిక్‌ టాయ్‌లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకుగాను సర్వే నిర్వహిస్తామన్నారు.  పెట్రోలుబంకులు, హోటళ్లలోని టాయ్‌లెట్లను ప్రజలు వినియోగించుకునేందుకు అనుమతించాల్సిందిగా కోరినప్పటికీ ఆశించిన మేరకు ఫలితమివ్వలేదన్నారు. దీన్ని కచ్చితంగా అమలు చేసేందుకు గాను తగిన చర్యల కోసం విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. బహిరంగ మూత్ర విసర్జనను నివారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్నీ వినియోగించుకుంటామన్నారు. బహిరంగ మూత్ర విసర్జనకు పాల్పడ్డవారిపై 617 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నగర జనాభా పెరుగుతున్నందున అందుకనుగుణంగా ట్రెంచ్‌లెస్‌ టెక్నాలజీతో సివరేజి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. కలుషిత జలాల నివారణకు భోలక్‌పూర్‌లో రూ.20.8 కోట్లతో కొత్త పైప్‌లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

రూ.6వేల కోట్లతో సివరేజి మాస్టర్‌ప్లాన్‌
నగరంలో సివరేజి వ్యవస్థను మెరుగుపరచేందుకు సీఎస్సార్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థల  సహకారం పొందనున్నట్లు కమిషనర్‌ దానకిశోర్‌ తెలిపారు. సివరేజి ప్లాంట్ల ఏర్పాటు కానీ, నిర్వహణ కానీ చేసేందుకు కొన్ని సంస్థలు ఆసక్తి కనబరిచాయన్నారు.  నగరానికి ఓడీఎఫ్‌ డబుల్‌ప్లస్‌ లభించడంతో  పారిశుధ్య నిర్వహణకు కేంద్రం ప్రోత్సాహక నిధులివ్వనుందన్నారు. గ్రేటర్‌లో దాదాపు రూ.6 వేల కోట్లతో సివరేజి మాస్టర్‌ప్లాన్‌  పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 

స్వచ్ఛభారత్‌కు 250 మార్కులు..
ఓడీఎఫ్‌ డబుల్‌ప్లస్‌ గుర్తింపు పొందిన నగరాలకు స్వచ్ఛ భారత్‌ ర్యాంకింగ్‌లలో 250 మార్కులు లభిస్తాయి. దీంతో నగరానికి స్వచ్ఛభారత్‌లోనూ మెరుగైన ర్యాంకుకు మార్గం సుగమమైనట్లు అధికారులు పేర్కొన్నారు. 

తనిఖీల్లో భాగంగా స్వచ్ఛభారత్‌ మిషన్‌ ప్రతినిధుల బృందం నగరంలోని 45 పబ్లిక్‌/కమ్యూనిటీ టాయ్‌లెట్లను పరిశీలించింది. 18 టాయ్‌లెట్లలోని పరిస్థితుల్ని తనిఖీ చేసింది. వాటిల్లో 12 ఎక్సలెంట్‌గా, 1 చాలా శుభ్రంగా, 5 తగిన విధంగా ఉన్నాయని అభిప్రాయపడింది.  

గుర్తింపు ఇలా...
స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆర్నెళ్లకోమారు తనిఖీలు చేసి ఓడీఎఫ్‌ నగరాలుగా ప్రకటిస్తుంది. ఒకసారి గుర్తింపు పొందిన నగరాల్లో తిరిగి పరిస్థితులు బాగులేకుంటే ఇచ్చిన గుర్తింపు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.  
2017 డిసెంబర్‌లో ఓడీఎఫ్‌ నగరంగా ఎంపికైన హైదరాబాద్‌ మహానగరం తాజాగా  ఓడీఎఫ్‌ డబుల్‌ప్లస్‌  నగరంగా ఎంపికైంది. బహిరంగ మల, మూత్ర  విసర్జన రహిత నగరాలకు ఓడీఎఫ్, బహిరంగ విసర్జకు జరిమానాలు విధించే నగరాలకు ఓడీఎఫ్‌ ప్లస్, మానవ విసర్జిత వ్యర్థాలను శాస్త్రీయంగా ట్రీట్‌మెంట్‌ చేసే సదుపాయాలుండటంతో పాటు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు పంపించే సదుపాయాలున్న నగరాలకు ఓడీఎఫ్‌ డబుల్‌ప్లస్‌ నగరాలుగా గుర్తింపునిస్తారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, జలమండలి ఎండీగా దానకిశోరే ఉండటంతో 18 ఎస్టీపీల్లో మానవ విసర్జితాల ట్రీట్‌మెంట్‌ సదుపాయాలు కల్పించడంతోపాటు  సెప్టిక్‌ట్యాంకుల నుంచి విసర్జితాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండేందుకు సెప్టిక్‌ట్యాంకర్‌ వాహనాలకు లైసెన్సులిచ్చే విధానాన్ని ప్రవేశపెట్టడం తదితర చర్యలు తీసుకున్నారు. దీంతో నగరం ఓడీఎఫ్‌నుంచి నేరుగా ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్‌గా ఎంపికైంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top