కేసీఆర్‌ సభపై.. దృష్టి! | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సభపై.. దృష్టి!

Published Sun, Sep 30 2018 10:44 AM

October Four KCR Meeting Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఇతర పార్టీలకు భిన్నంగా టీఆర్‌ఎస్‌లో ఎన్నికల జోష్‌ కనిపిస్తోంది. ఈ నెల 6వ తేదీనే ఆ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా కేవలం రెండు నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. విపక్ష పార్టీల కంటే ముందుండాలన్న నాయకత్వ వ్యూహంలో భాగంగా అక్టోబర్‌ 4వ తేదీన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాల్గొననున్నారు. నల్లగొండ బైపాస్‌ సమీపంలో నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పన్నెండు నియోజకవర్గాల నుంచి కనీసం మూడు లక్షల మందిని సమీకరించే పనిలో పార్టీ నాయకులు ఉన్నారు. ఇరవై రోజులకు పైగా పార్టీ అభ్యర్థులు తమ నియోకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అన్ని నియోకవర్గాలకు ప్రచార సామగ్రి కూడా సరఫరా చేశారు. ఒక్కో నియోజకవర్గానికి కనీసం రూ.10లక్షల విలువైన ప్రచార సామగ్రి అందినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో ఇదే ఎన్నికల ఊపును కొనసాగించేందుకు పార్టీ శ్రేణులు  శ్రమిస్తున్నాయి. దీనిలో భాగంగానే నల్లగొండ జిల్లా కేంద్రంలో పార్టీ అధినేత కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే, మరోవైపు ఈ సభ సక్సెస్‌పై దృష్టి పెట్టారు. నియోజకవర్గానికి కనీసం పాతిక వేల మందిని తీసుకువస్తే కానీ పెట్టుకున్న లక్ష్యం మేరకు మూడు లక్షల మందిని సమీకరించే అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు నేతలంతా దీనిపైనే దృష్టి సారించారు.

సన్నాహక సమావేశాలు
పార్టీ అధినేత కేసీఆర్‌ పాల్గొంటున్న సభ కావడం, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ హాజరు కానున్న మూడో సభ కావడంతో జిల్లా నాయకత్వం సవాల్‌గా తీసుకుంది. విపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో, తమ ప్రత్యర్థులు ఎవరనే విషయాన్ని పక్కన పెట్టి నియోజకవర్గాలను పూర్తిస్థాయిలో చుట్టివచ్చే పనిలోఉన్నారు. ఇదే క్రమంలో ప్రతి గ్రామం నుంచి కేసీఆర్‌ సభకు జనాన్ని సమీకరించడం ద్వారా అంతటా ఎన్నికల వేడిని పుట్టించవచ్చని, ప్రతిపక్ష అభ్యర్థులు గ్రామాలకు వచ్చే సమయానికే తాము కనీసం ఒకటికి రెండు సార్లు తిరిగి రావచ్చన్న ఆలోచనతో పల్లెలకు వెళుతున్నారు. దీనికి గాను మండలాలు, గ్రామాల వారీగా టార్గెట్లు పెట్టేందుకు ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మండలాల వారీగా సన్నాహక సమావేశాలు కూడా జరుపుతున్నారు.

ఇవి కూడా చిన్నపాటి బహిరంగ సభలను తలపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు, ఎంపీలు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌లు ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న సన్నాహక సమావేశాలకు హాజరవుతున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో తిప్పర్తి, శనివారం కనగల్, పెద్దవూరలో ఇప్పటికే  సమావేశాలు జరిగాయి. ఆదివారం నకిరేకల్‌ నియోజకవర్గం చిట్యాల, నల్లగొండ జిల్లాకేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమీకరణ బాధ్యతలు అప్పజెప్పేందుకు ఈ సమావేశాలు జరుపుతున్నారు.
 
బైక్‌.. ఆటో ర్యాలీలు
నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు, కేసీఆర్‌ బహిరంగ సభను అవకాశంగా భావిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు కార్యకర్తలకు చేతినిండా పని పెడుతున్నారు. నల్లగొండకు సమీపంలో ఉన్న నియోజకవర్గాలు, మండలాల నుంచి పెద్ద ఎత్తున సభకు కార్యకర్తలను సమీకరించే పనిలో ఉన్నారు. నకిరేకల్‌ నియోజకవర్గంనుంచి ఈ సభకు కనీసం 10వేల మోటార్‌ బైక్‌లు, 1500 ఆటోలతో ర్యాలీగా రావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల చెప్పాయి. కేవలం కట్టంగూరు, నకిరేకల్, కేతేపల్లి మండలాల నుంచి వీటిని ఏర్పాటు చేస్తుండగా, రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల నుంచి పెద్ద వాహనాలు ఏర్పాటు చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సన్నాహక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభ్యర్థులను ప్రకటించని కోదాడ, హుజూర్‌నగర్‌ నియోకవర్గాల్లో హడావిడి కొంత తక్కువగా కనిపిస్తున్నా.. మిగిలిన పది నియోజకవర్గాల్లో ఎన్నికల జోష్‌ ఎక్కువగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement