ఎన్నారై.. ఎవరికి సై?

NRI Votes In Old City And Panjagutta hyderabad - Sakshi

పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, కార్వాన్‌లో వీరి ఓట్లు అధికం   

ప్రతి నియోజకవర్గంలో వందల సంఖ్యలో..  

గ్రేటర్‌ పరిధిలో 1.5 లక్షల మంది విదేశాల్లో..

ఓటర్‌ లిస్టులో మాత్రం స్థానికులుగా గుర్తింపు

పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారా?

‘సాక్షి’ ప్రతినిధి క్షేత్రస్థాయి పరిశీలనలో పలు అంశాలు వెల్లడి

 సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేకంగా పాతబస్తీ నుంచి వేల సంఖ్యలో జనం విదేశాల్లో నివసిస్తున్నారు. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అంచనా ప్రకారం విదేశాల్లో ఉంటున్నవారిలో మొదటి స్థానంలో కేరళవాసులు ఉండగా, రెండో స్థానంలో పంజాబ్‌ ఉంది. మూడో స్థానంలో తెలంగాణవాసులు ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో వీరి ఓటు గెలుపు ఓటములను ప్రభావితం చేయనుందా.. ఏ పార్టీ వైపు వీరు మొగ్గు చూపనున్నారనే అంశం ఉత్కంఠగా మారింది. కాగా ఓటర్‌ జాబితాలో వీరి పేర్లు ఎన్నారైలుగా గుర్తించి లేవు. గతంలో ఓటర్‌ జాబితాలోని చివరి పేజీలో ఎన్నారైల సంఖ్య ఉండేది. ఇటీవల విడుదలైన జాబితాలో ఎన్నారై కాలమ్‌ లేకపోవడం గమనార్హం. అయితే వీరి పేర్లు ఓటర్‌ లిస్ట్‌లో వేరుగా లేకపోవడంతో బోగస్‌ ఓటింగ్‌ అయ్యే ప్రమాదం ఉందని పలు రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన అంశాలపై ప్రత్యేక కథనం.       

సుమారు ఇంటికి ముగ్గురు చొప్పున..  
చాంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్‌పేట్, చార్మినార్, నాంపల్లి నియోజకవర్లాల్లోని పలు బూత్‌ల్లో   సుమారు ఇంటికి సుమారు ముగ్గురు చొప్పున విదేశాల్లో ఉంటున్నారు. ఇది కేవలం చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలో కాదు.. చార్మినార్, యాకత్‌పురా, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట్, ఖైరతాబాద్, ఎల్‌బీనగర్‌తో పాటు గ్రేటర్‌లోని వివిధ నియోజవర్గాల ప్రజలు విదేశాల్లో ఉంటున్నారు. ఎమ్మిగ్రేషన్‌ అధికారుల అంచనా ప్రకారం గ్రేటర్‌ పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన దాదాపు 1.5 లక్షల మంది విదేశాల్లో ఉంటున్నారు. ఇందులో గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం పాతబస్తీలోని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌నంబర్‌ 93 నుంచి 110లో ఎన్నారైలు అత్యధికంగా ఉన్నట్లు  సాక్షి సర్వేలో తేలింది. దీంతో పాటు కార్వాన్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 116 నుంచి, 185 వరకు ఇదే నియోజకవర్గంలోని బూత్‌ నంబర్‌ 223 నుంచి 240 వరకు ఉన్న ఇళ్లలో ఉంటున్న వారు కూడా విదేశాల్లో ఉంటున్నారు.

 బోగస్‌లనుఅరికట్టడం కష్టమే..
ఓటరు లిస్టులో ఎన్నారై ఓటుగా నమోదు కాకపోవడంతో బోగస్‌ ఓట్లను అరికట్టడం కష్టమవుతుందని నియోజకవర్గాల ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఓటేసే వ్యక్తి పురుషుడై తే అతని ముఖం చూసి గుర్తు పట్టవచ్చని, మహిళ అయితే మాత్రం గుర్తించడం కష్టమేనని భావిస్తున్నారు. విదేశాల్లో ఉండే వ్యక్తులు ఎన్నారైలుగా ఓటరు లిస్ట్‌లో ప్రత్యేకంగా గుర్తించాలని, దీంతో బోగస్‌ ఓట్లను పోల్‌ కాకుండా చర్యలు తీసుకోచ్చని రిట్నరింగ్‌ అధికారుల అంచనా.

పాస్‌పోర్టు చూపించి ఓటేయవచ్చు.. 
భారతదేశానికి చెందిన ఏ వ్యక్తి అయినా విదేశాల్లో ఉంటే అతను తన ఓటును ఎన్నారైగా నమోదు చేసుకొవాల్సి ఉంటుంది. ఎన్నారైగా నమోదు అయి ఉంటే అతడు ఉంటున్న దేశంలో ఓటు వేసుకునే సౌకర్యం ఉంటుంది. ఒకవేళ అతడు విదేశాల్లో ఉండి కూడా ఓటు స్థానికంగా ఓటరు లిస్ట్‌లో నమోదు అయి ఉంటే అతని ఓటు వేరేవారు వినియోగించే అవకాశం ఉంటుంది. ఎన్నారైగా నమోదు చేసుకున్న ఎన్నికల సందర్భంగా అతడు స్వదేశానికి వచ్చి ఉంటే ఏ ప్రాంతంలో ఓటు ఉందో అక్కడి వెళ్లి తన పాస్‌పోర్టును చూపించి ఓటు వినియోగించుకోవచ్చు.

ఎన్నారైల ఓట్లు యథాతథంగా..  
పాతబస్తీలోని బార్కస్‌తో పాటు కార్వాన్‌లోని టోలిచౌకి, మలక్‌పేటలోని సైదాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందినవారిలో విదేశాల్లో ఉంటున్న వారి పేర్లు ఓటర్‌ లిస్టులో ఎన్నారైలుగా నమోదై లేవు. అయినా వీరి పేర్లు యథాతథంగా ఓటర్‌ లిస్టులో ఉన్నాయి. 2009 కంటే ముందున్న ఓటర్‌ లిస్టును పరిశీలిస్తే అందులో చివర బూత్‌లో పురుషులు, మహిళలు, ఇతరులు ( థర్డ్‌జెండర్స్‌)లో పాటు ఎన్నారైలుగా వీరి పేర్లు స్పష్టంగా ఉన్నాయి. ఈ అక్టోబర్‌ 12న విడుదలైన ఓటరు లిస్ట్‌లో ఎన్నారై కాలమ్‌ లేకపోవడం గమనార్హం.     

ఎన్నారైల ఓట్లనువేరుగా గుర్తించాలి
ఎన్నారైల ఓట్లు ఓటరు లిస్ట్‌లో వేరుగా నమోదు కాకపోవడంతో ఎన్నికల అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురి కానున్నారు. బోగస్‌ ఓట్లు వేసే ప్రమాదం ఉంది. దీనిపై ఎన్నికల అధికారులు, జీహెచ్‌ఎంసీ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాం. ఎన్నారైలను ఓటర్‌ లిస్టులో వేరుగా గుర్తించాలి.      – అంజదుల్లాఖాన్‌ ఖాలిద్,    ఎంబీటీ అధికార ప్రతినిధి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top