అందని గౌరవం!

No Salaries To Panchayat Officers From 13 Months - Sakshi

పదవీకాలం ముగిసినా.. 13 నెలల బకాయిలు

జిల్లా వ్యాప్తంగా రూ.2.38 కోట్ల వేతనాలు పెండింగ్‌

ఆందోళనలో తాజామాజీ సర్పంచ్‌లు

సీఎం కేసీఆర్‌ స్పందించాలని వినతి

సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినా.. వీరికి చెల్లించాల్సిన 13 నెలల గౌరవ వేతనాలు అందలేదు. నెలకు రూ.5 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.65 వేలు రావాలి. ఇలా జిల్లాలోని 367 మందికి సంబంధించి రూ.2.38 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ధనిక రాష్ట్రంగా చెప్పుకొంటున్న తెలంగాణ ఖజానాలో తమకు ఇవ్వాల్సిన డబ్బులకు తావు లేకుండా పోతోందని తాజామాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ స్పందించి బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు.

సాక్షి, వికారాబాద్‌: ‘గ్రామానికి ప్రథమ పౌరులైన సర్పంచులకు ఇంత తక్కువ గౌరవ వేతనాలు ఇవ్వడమేంటీ?. గత ప్రభుత్వాలు వీరిని నిర్లక్ష్యం చేశాయి. గ్రామస్థాయిలో పరిపాలన సక్రమంగా, నిజాయతీగా ఉండాలంటే సర్పంచులకు గౌరవ వేతనాలు పెంచాల్సిందే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవవేతనం పెంచాలని నిర్ణయం తీసుకుంది’ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015లో చెప్పిన మాటలివి. ఈ మేరకు సర్పంచ్‌లకు గౌరవ వేతనాలను పెంచుతూ 2015 ఏప్రిల్‌ 1వ తేదీన ప్రభుత్వం జీవోనెం.53 జారీచేసింది.

నెలకోసారి వేతనాలిస్తామని ప్రకటించింది. కానీ ఏప్పుడూ ఎప్పుడూ సక్రమంగా ఇవ్వలేదు. ప్రస్తుతం జిల్లాలోని 367 జీపీల సర్పంచ్‌లకు రూ.2,38,55,000 బకాయి ఉన్నాయి. ఒక్కో సర్పంచ్‌కు నెలకు రూ.5 వేల చొప్పున 13 నెలలకుగాను రూ.65 వేలు రావాల్సి ఉంది. గౌరవ వేతనాలను విడుదల చేయడంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందని జిల్లాలోని తాజామాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

భారీగా పెరిగిన జీతాలు...

జిల్లాలోని 18 మండలాల్లో 367 పంచాయతీలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉమ్మడి ఏపీలో సర్పంచులకు అతి తక్కువ వేతనాలుండేవి. జిల్లా పరిషత్‌చైర్మన్‌కు రూ.7,500, జెడ్పీటీసీ సభ్యుడికి రూ.2,250, మండల పరిషత్‌ అధ్యక్షునికి రూ.1,500, ఎంపీటీసీకి రూ.750 అందజేసేవారు. ఇక సర్పంచుల విషయానికొస్తే మేజర్‌ పంచాయతీలకు రూ.1,500, మైనర్‌ జీపీల సర్పంచులకు రూ.1,000 ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అతితక్కువ గౌరవ వేతనం ఉండటాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ వీరి వేతనాలను పెంచాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన 1.4.2015న వేతనాల పెంపును సవరించే విధంగా జీవోనెం.53ను విడుదల చేశారు. దీంతో వారి వేతనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌ చైర్మన్‌కు రూ.లక్ష, జెడ్పీటీసీ, ఎంపీపీకి రూ.10 వేల చొప్పున, ఎంపీటీసీలు, సర్పంచులకు రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం వెలువర్చింది.

గ్రామపంచాయతీల అకౌంట్‌లో జమచేస్తే తీసుకునే అవకాశాన్ని సర్పంచులకు కల్పించారు. ఈ వేతనాలను నెలనెలా ఇస్తామని అప్పట్లో ప్రకటించిన సర్కారు మొదట్లో నాలుగైదు నెలలకోసారి ఇచ్చేవారు. కాగా ప్రస్తుతం గతనెలాఖరు వరకు 13నెలల బకాయలు తమకు రావాల్సి ఉందని సర్పంచులు పేర్కొంటున్నారు. 2017 సంవత్సరం జూన్‌ నెలవరకు వరకు వేతనాలిచ్చారు. 2017 జూలై నుంచి ఈనెల (జూలై) 2018 వరకు 13 నెలల బకాయలు ఉన్నాయి.

జిల్లాలో 367 గ్రామపంచాయతీల సర్పంచులకు నెలకు రూ.5 వేల చొప్పున ఈనెలాఖరు వరకు బకాయలు జిల్లా వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులకు 2,38,55,000 ఇవ్వాల్సి ఉంది. తమ పదవీ కాలం ముగిసినప్పటికీ వేతనాలు మాత్రం ఇవ్వలేదని సర్కారుపై అసంతప్తితో ఉన్నారు. ఇటు పర్సన్‌ ఇన్‌చార్జులుగా నియమించలేక అటు గౌరవ వేతనాలు ఇవ్వక తమను అవమానపరిచారని వారు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. తాజా మాజీ సర్పంచులలో అధికశాతం మంది పేద, మధ్య తరగతివారే ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని జిల్లా సర్పంచుల సంఘం విజ్ఞప్తిచేస్తోంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top