బస్సెక్కం.. బస్కీలు తీయం!

లోకల్ సర్కిల్స్ సర్వేలో జనం మనోగతం
సాక్షి, హైదరాబాద్ : ‘చుక్‌చుక్ రైలూ వస్తోంది.. దూరం దూరం జరగండీ..’ చిన్నప్పుడు పాడుకున్న ఈ పాట గుర్తుంది కదా! కొంచెం అటూఇటూగా ఇప్పుడు సీన్ అలాగే ఉంది. కరోనా భయంతో బస్సు, రైలు ప్రయాణాలంటేనే ‘దూరం.. దూరం’అంటున్నారు జనం. ఇప్పట్లో ప్రజా రవాణా అవసరంలేదని తేల్చేస్తున్నారు. ఇక, జిమ్, స్విమ్మింగ్‌పూల్, హోటల్, హాలీడే స్పాట్‌లంటారా?.. అటుపక్కకే వెళ్లబోమన్నారు. ‘లోకల్ సర్కిల్స్’అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 241 జిల్లాల నుంచి 24 వేల మందికిపైగా అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించింది. ఇందులో 68% పురుషులు, 32% మహిళలు ఉన్నారు. 49% మంది మెట్రో, 36% ద్వితీయ శ్రేణి నగరాలు, 15 శాతం 3, 4వ శ్రేణి పట్టణాల ప్రజల నాడి తెలుసుకుంది.