‘దక్కన్’ వచ్చినా.. దుఃఖమే మిగిలింది!
జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, ఖాజీపల్లి, బొంతపల్లి గ్రామాల్లో వందల సంఖ్యలో వివిధ పరిశ్రమలు ఉన్నాయి...
ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. స్థానికంగా కొత్త పరిశ్రమలు స్థాపించడంలో తమకు ఉపాధి దక్కుతుందని ఆశపడ్డ యువతకు నిరాశేమిగులుతుంది. పరిశ్రమల యాజమన్యాలు ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ స్థానికులను పట్టించుకోవడం లేదు. దీంతో ఆవేదన చెందిన యువత ఆందోళబాట పట్టింది. - జిన్నారం
- స్థానిక యువతకు దక్కని ప్రాధాన్యత
- పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం పాకులాడుతున్న యువత
- స్థానికులకు ప్రాధాన్యతను ఇవ్వటం లేదని ఆవేదన
జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, ఖాజీపల్లి, బొంతపల్లి గ్రామాల్లో వందల సంఖ్యలో వివిధ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో వేల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగాలు విధులు నిర్వహిస్తున్నారు. పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 90శాతం ఇతర రాష్ట్రాలు, ఇతరప్రాంతాలకు చెందిన వారేకావడం గమనార్హం.
తెలంగాణ ఏర్పాటు తర్వాతనైనా తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువతకు నిరాశే మిగిలింది. పరిశ్రమ యాజమాన్యాలు ఇవ్వలేదనకుండా స్థానికులకు అవకాశం కల్పిస్తున్నా అవి స్వీపర్ స్థాయి ఉద్యోగాలే కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఒక స్థాయిలో విధులు నిర్వహిస్తున్న వారిని సైతం చిన్నపాటి తప్పును చూపి తొలగిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అన్నం పెట్టే భూములు ఇచ్చి, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని భరిస్తున్న తమకు పరిశ్రమల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు యువతతో పాటు తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి.
ఉపాధి కోసం పోరుబాట
రామచంద్రాపురం మండలం కొడకంచి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డెక్కన్ ఆటో పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధిని కల్పించకుండా, ఇతర ప్రాంతాల వారికి ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆరోపిస్తూ యువకులు పరిశ్రమ ముందు బైఠాయించారు. పరి శ్రమలను స్థాపిస్తున్న సమయంలో 60శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని అనుమతులు తీసుకుంటున్న యాజమాన్యాలు, తీరా అనుమతులు వచ్చి పరిశ్రమను ప్రారంభిస్తున్న సమయంలో నిబంధనలకు పట్టించుకోవటం లేదు.
అన్ని పరిశ్రమల్లో ఇదే పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు స్థానికులకు ఉపాధిని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశలను ప్రభుత్వం ఫలించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికులకు ఉపాధి కోసం పోరాటం
స్థానికులకు ఉపాధిని కల్పించాలని పోరాటం చేస్తున్నాం. పరిశ్రమల యామాన్యాలు నిబంధనలను పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలు స్థానిక యువతకే ఉపాధిని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి.
-అనిల్‌రెడ్డి,యువజన నాయకులుబొల్లారం


