breaking news
Industry jobs
-
జీసీసీల్లో కొలువులు @ 34.6 లక్షలు!
ముంబై: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమలో ఉద్యోగాలు కూడా భారీగా పెరగనున్నాయి. దీంతో సిబ్బంది సంఖ్య 2026 నాటికి 11 శాతం వృద్ధి చెంది 24 లక్షలకు, ఆ తర్వాత 2030 నాటికి 34.6 లక్షలకు చేరనుంది. ప్రస్తుత స్థాయితో పోలిస్తే అప్పటికి 13 లక్షల కొలువులు కొత్తగా జతకానున్నాయని అంతర్జాతీయ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ ఎన్ఎల్బీ సర్విసెస్ ఒక నివేదికలో తెలిపింది. ‘జీసీసీ 4.0 ప్రస్థానంలో భారత్ కీలక దశలో ఉంది.నేడు జీసీసీలు కేవలం కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగించుకోవడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. దాన్ని వినియోగంలోకి తెచ్చే దిశగా ముందుకు వెళ్తున్నాయి. సాధారణంగా ఈ పరిశ్రమలో ఏఐ జోరు ఊహించినదే అయినప్పటికీ ఈ సంవత్సరం ఇది కాస్త వేగవంతమైంది‘ అని సంస్థ సీఈవో సచిన్ అలగ్ తెలిపారు. దీనితో నిపుణుల నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశీయంగా ఆరు నగరాల్లో 10 రంగాల నుంచి 321 జీసీసీ దిగ్గజాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎన్ఎల్బీ సర్వీసెస్ ఈ నివేదిక రూపొందించింది. 2025 జూలై–అక్టోబర్ మధ్య ఈ సర్వే నిర్వహించారు. రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు.. ⇒ ఏఐ వినియోగం పెరిగే కొద్దీ జీసీసీల్లో కొత్త రకం కొలువులు వస్తున్నాయి. సైబర్‌సెక్యూరిటీ, ఏఐ గవర్నెన్స్ ఆర్కిటెక్ట్స్ (29 శాతం), ప్రాంప్ట్ ఇంజినీర్స్ (26 శాతం), జెన్ఏఐ ప్రోడక్ట్ ఓనర్స్ (22 శాతం), ఏఐ పాలసీ అండ్ రిస్క్ స్ట్రాటెజిస్ట్స్ (21 శాతం)కి డిమాండ్ నెలకొంది. ⇒ అదే సమయంలో ఎల్1 ఐటీ సపోర్ట్ (75 శాతం), లెగసీ అప్లికేషన్ డెవలప్మెంట్ (74 శాతం), మాన్యువల్ క్యూఏ (72 శాతం), ఆన్–ప్రెమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ (67 శాతం) విభాగాల్లో ఉద్యోగాలను జీసీసీలు దశలవారీగా తొలగిస్తుండటం గమనార్హం. ⇒ భౌగోళికంగా జీసీసీలు మెట్రో నగరాల నుంచి క్రమంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు మళ్లుతున్నాయి. చిన్న పట్టణాల్లో అట్రిషన్ (ఉద్యోగుల వలస) రేటు తక్కువగా 10–12 శాతం స్థాయిలో ఉండటం, ఆఫీస్ వ్యయాలు 30–50 శాతం తక్కువగా ఉండటం, ఉద్యోగులపై వ్యయాలు 20–35 శాతం మేర తక్కువగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణం. ⇒ 2030 నాటికి జీసీసీల్లో 39 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి పని చేసే అవకాశం ఉంది. మరోపక్క ప్రథమ శ్రేణి నగరాలు లీడర్íÙప్, గవర్నెన్స్, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలకు కేంద్రాలుగా కొనసాగనున్నప్పటికీ, కోయంబత్తూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్ లాంటి ద్వితీయ, తృతీయ శ్రేణి హబ్‌లు చాలా వేగంగా స్పెషలైజ్డ్ డెలివరీ సెంటర్లుగా ఎదుగుతున్నాయి. -
‘దక్కన్’ వచ్చినా.. దుఃఖమే మిగిలింది!
ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. స్థానికంగా కొత్త పరిశ్రమలు స్థాపించడంలో తమకు ఉపాధి దక్కుతుందని ఆశపడ్డ యువతకు నిరాశేమిగులుతుంది. పరిశ్రమల యాజమన్యాలు ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ స్థానికులను పట్టించుకోవడం లేదు. దీంతో ఆవేదన చెందిన యువత ఆందోళబాట పట్టింది. - జిన్నారం - స్థానిక యువతకు దక్కని ప్రాధాన్యత - పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం పాకులాడుతున్న యువత - స్థానికులకు ప్రాధాన్యతను ఇవ్వటం లేదని ఆవేదన జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, ఖాజీపల్లి, బొంతపల్లి గ్రామాల్లో వందల సంఖ్యలో వివిధ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో వేల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగాలు విధులు నిర్వహిస్తున్నారు. పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 90శాతం ఇతర రాష్ట్రాలు, ఇతరప్రాంతాలకు చెందిన వారేకావడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటు తర్వాతనైనా తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువతకు నిరాశే మిగిలింది. పరిశ్రమ యాజమాన్యాలు ఇవ్వలేదనకుండా స్థానికులకు అవకాశం కల్పిస్తున్నా అవి స్వీపర్ స్థాయి ఉద్యోగాలే కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఒక స్థాయిలో విధులు నిర్వహిస్తున్న వారిని సైతం చిన్నపాటి తప్పును చూపి తొలగిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అన్నం పెట్టే భూములు ఇచ్చి, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని భరిస్తున్న తమకు పరిశ్రమల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు యువతతో పాటు తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి. ఉపాధి కోసం పోరుబాట రామచంద్రాపురం మండలం కొడకంచి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డెక్కన్ ఆటో పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధిని కల్పించకుండా, ఇతర ప్రాంతాల వారికి ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆరోపిస్తూ యువకులు పరిశ్రమ ముందు బైఠాయించారు. పరి శ్రమలను స్థాపిస్తున్న సమయంలో 60శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని అనుమతులు తీసుకుంటున్న యాజమాన్యాలు, తీరా అనుమతులు వచ్చి పరిశ్రమను ప్రారంభిస్తున్న సమయంలో నిబంధనలకు పట్టించుకోవటం లేదు. అన్ని పరిశ్రమల్లో ఇదే పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు స్థానికులకు ఉపాధిని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశలను ప్రభుత్వం ఫలించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానికులకు ఉపాధి కోసం పోరాటం స్థానికులకు ఉపాధిని కల్పించాలని పోరాటం చేస్తున్నాం. పరిశ్రమల యామాన్యాలు నిబంధనలను పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలు స్థానిక యువతకే ఉపాధిని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. -అనిల్‌రెడ్డి,యువజన నాయకులుబొల్లారం


