పంచాయతీ ఎన్నికలకు ప్రణాళిక

Next Target Panchayathi Elections - Sakshi

12న అభ్యంతరాల స్వీకరణ

13, 14న గ్రామ సభలు 

ఖమ్మంసహకారనగర్‌: నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల సందడి..ముగిసిందో లేదో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు జనవరి నెలలోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో అధికారులంతా ఆ పనుల్లో నిమగ్నమవుతున్నారు. కొత్త గ్రామ పంచాయతీల ప్రకారం రిజర్వేషన్లను పూర్తి చేసి ఎన్నికలు  నిర్వహించనున్నారు. తాజాగా బీసీ ఓటర్ల గణనను చేయాలని ఆదేశాలు అందడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ కసరత్తులో నిమగ్నమైంది. ఆదివారం బీసీ ఓటర్లకు సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను గ్రామ పంచాయతీల వారీగా విడుదల చేశారు. జిల్లాలోని 584గ్రామ పంచాయతీల్లో ఈ పోరు మొదలవనుంది. 21మండలాల పరిధిలో 584 గ్రామ పంచాయతీలు ఉండటంతో వాటిల్లో బీసీ ఓటర్ల గణనపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎట్టకేలకు ఆదివారం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి అదే రోజున పరిశీలించనున్నారు.
 
గ్రామసభలు ఇలా.
12వ తేదీన అందిన అభ్యంతరాలు, ఓటర్ల గణనపై 13, 14వ తేదీల్లో అంతటా గ్రామసభలు నిర్వహించనున్నారు. అనంతరం 15వ తేదీన ఓటరు జాబితాను ప్రకటించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లలో సందిగ్ధత నెలకొనడంతో పాటు ఈ నెల 11వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ రాజ్‌ ఎన్నికల గడువు కూడా దగ్గర పడుతుండడంతో వచ్చే కొత్త ప్రభుత్వం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.
 
15న తుది జాబితా.. 
బీసీ ఓటర్ల తుది జాబితాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 13, 14వ తేదీల్లో గ్రామసభ అనంతరం 15వ తేదీన తుది జాబితాను విడుదల చేయనున్నారు. దీని ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి.

డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ వేశాం.. 
గ్రామ పంచాయతీల్లో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశాం. 12న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అనంతరం 13, 14వ తేదీల్లో గ్రామసభలు నిర్వహిస్తాం. ఆ తర్వాత తుది జాబితాను విడుదల చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.  
 – శ్రీనివాస్, డీపీఓ, ఖమ్మం     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top