క్షీరదాలలో కొత్తరకం సూక్ష్మజీవ నిరోధక మూలాలు

A New Anti Microbrial Protien Has Been Discovered By CCMB Scientists - Sakshi

హైదరాబాద్‌: గుడ్లు పెట్టే క్షీరదాలలో ఎకిడ్‌నా జాతికి చెందిన జంతువుల పాలలో సరికొత్తరకం సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్‌ ఆనవాళ్లు ఉన్నట్లు సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కోవకు చెందిన జంతువులు, వాటి సంతానం ఎటువంటి అంటురోగాల బారిన పడకుండా తమ పాల ద్వారా సంరక్షించుకొంటున్నట్లు పరిశోధన ద్వారా తెలిసింది. సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీకి చెందిన డాక్టర్‌ సతీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని పరిశోధక బృందం ఈ ప్రొటీను, కణంపై పొరలో రంధ్రాలను ఏర్పరుస్తున్నట్లు కనిపెట్టారు.  ఈ కారణంగా వీటిని సూక్ష్మజీవి నాశక మందులకు ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించవచ్చునని సతీశ్‌ చెబుతున్నారు.  ఈకోలిని ఉపయోగిస్తూ సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్‌ను భారీ పరిమాణంలో ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ బృంద సభ్యులు మార్గాలను కనుగొన్నారు.

మూగజీవుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం పశు పోషణ రంగంలో సూక్ష్మజీవి నాశకాల(యాంటి బయోటిక్‌)ను విచక్షణా రహితంగా ఉపయోగిస్తున్నారని, ఫలితంగా సూక్ష్మజీవి నాశకాలను తట్టుకుని నిలిచే బ్యాక్టీరియా సంతతి పెరుగుతోందని సతీష్‌ చెప్పారు. డాక్టర్‌ సతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం ఎకిడ్‌నా నుంచి సంగ్రహించిన సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్‌కు మాస్టయిటిస్‌ కారక బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఉన్నదని రుజువు చేయగలిగింది. ఈ పరిశోధన తాలూకు నివేదికను ఇటీవల ‘బయోచిమికా ఎట్‌ బయోఫిజికా యాక్టా-బయోమెంమెబ్రేన్స్‌’లో ప్రచురించారు.సీఎన్‌ఐఆర్‌-సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా మాట్లాడుతూ..  సాంక్రమిక వ్యాధులు అంతకంతకూ పెరుగుతున్నటువంటి ప్రస్తుత వాతావరణంలో ముందంజ వేసేందుకు ఈ అధ్యయనాలు ఒక ఉత్తమ మార్గంగా ఉన్నాయని అన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top