
సాక్షి,సిటీబ్యూరో: అల్లారుముద్దుగా చూసుకుంటున్న పిల్లలు అనుకోని ప్రమాదంలో పడుతున్నారు. అది గుర్తించేలోగా పరిస్థితి చేయి దాటిపోతోంది. గ్రేటర్‌లో ప్రతి వంద మంది చిన్నారుల్లో ఒకరు మెదడు, న్యూరో సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్) సంస్థ తాజాగా చేసిన అధ్యయనంలో ఈ అంశాన్ని గుర్తించారు. ఈ సమస్యలను ‘న్యూరో డెవలప్‌మెంటల్‌డిజార్డర్స్’(ఎన్‌డీడీ)గా పిలిచే ఈ తరహా సమస్యలతో 2–9 ఏళ్ల వయసున్న వారే ఎక్కువగా బాధపడుతున్నట్టు స్టడీలో తేలింది. సంస్థకు చెందిన నిపుణులు గ్రేటర్‌లోని 5 వేల మంది చిన్నారులపై అధ్యయనం చేయగా మెదడు, నరాలకు సంబంధించిన సమస్యలతో పలువురు అవస్థలు పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ‘దృష్టి లోపం, ఎపిలెప్సి, న్యూరోమోర్టార్ సమస్యలు, సెరిబ్రల్ పాల్సీ, చెవుడు, సరిగా మాట్లాడలేకపోవడం, ఆటిజం, మానసిక పరిపక్వత లేకపోవడం’ వంటి న్యూరో డెవలప్‌మెంట్ డిజార్డర్స్ వెలుగు చూశాయి. చాలా మంది చిన్నారులకు తరగతి గదుల్లో పాఠాలు సరిగా వినిపించకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ విషయంలో జాతీయ స్థాయి సగటు కంటే గ్రేటర్‌లో అధిక శాతం మంది ఉన్నట్టు తేల్చారు. ఇక్కడి పిల్లలు ఏదో ఒక న్యూరో డెవలప్‌మెంట్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లువెల్లడించారు.
వయసు వారీగా బాధితులు..
♦ గ్రేటర్‌లో 2–6 ఏళ్ల చిన్నారుల్లో 2.9 శాతం నుంచి 18.7 శాతం మంది ఎన్‌డీడీ సమస్యలతో బాధపడుతున్నారట.
♦ 6–9 ఏళ్ల మధ్యనున్న వారిలో 6.5 నుంచి 18.5 శాతం మంది బాధుతులున్నారు. ఈ వయోగ్రూపులో చాలామంది ఒకటి రెండు సమస్యలు సర్వసాధారణంగా ఉండడం ఆందోళన
కలిగిస్తోంది.
♦ జాతీయ స్థాయిలో 2–6 ఏళ్లలోపు వారి 9.2 శాతం బాధితులు ఉండగా, 6–9 ఏళ్లలోపు వారిలో 13.6 శాతం మంది ఉన్నారు.
ఐఐపీహెచ్ అధ్యయనంలో పాల్గొన్నవారు
♦ ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నవారిలో 18 ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన చిన్నపిల్లల వైద్యనిపుణులు, నరాల వైద్యులు, ఎపిడెమాలజీ, పబ్లిక్‌హెల్త్, సోషల్ సైన్స్, బయో స్టాటిస్టిక్స్, చైల్డ్ సైకాలజీ, ఈఎన్‌టీ, కంటి వైద్యులు సభ్యులుగా ఉన్నారు.
ముందుగా ఇలా గుర్తించాలి..
ఎన్‌డీడీ సమస్యలను చిన్నతనంలోనే ఎలా గుర్తించాలో ఈ అధ్యయనం తెలిపింది.
ఇళ్లలో ప్రసవాలు జరగడం, పుట్టిన సమయంలో వెంటనే ఏడవక పోవడం, శ్వాస కష్టంగా తీసుకోవడం, పుట్టిన వెంటనే అనారోగ్యానికి గురికావడం, రెండు కిలోల కంటే తక్కువ బరువుతో జన్మించడం, నెలలు నిండకముందే జన్మించిన వారిలో ఇలాంటి సమస్యలు కనిపిస్తాయని నిపుణులు వెల్లడించారు. ఇక న్యూరో డెవలప్‌మెంట్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న చిన్నారులకు ఎక్స్‌రే, సీటీ బ్రెయిన్, ఎంఆర్‌ఐ బ్రెయిన్, రక్త పరీక్షల ద్వారా గుర్తించాల్సి ఉంటుందని ప్రకటించారు. ఆదిలోనే గుర్తించి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తే ఎన్‌డీడీ సమస్యల నుంచి చిన్నారులకు విముక్తి లభిస్తుందని అధ్యయన బృందం
పేర్కొంది.
న్యూరో సమస్యలకు కారణాలివీ..
చాలా ప్రాంతాల్లో వసతులున్న ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగడం లేదు. కొన్నిసారు బిడ్డ పుట్టిన వెంటనే అనారోగ్యానికి గురవుతుంటారు. మెదడుకు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు సోకడం, తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకముందే జన్మించడం వంటి కారణలతో పాటు కొందరిలో జన్యుపరమైన లోపాలు సైతం ఉంటున్నాయి.