వైరస్‌..మటాష్‌

Neo Inventronics Innovation Machine For Closed Coronavirus - Sakshi

వైరస్‌ను నాశనం చేసే యంత్రానికి రూపకల్పన

నియో ఇన్వెంట్రానిక్స్‌ ఆధ్వర్యంలో జెర్మిబ్యాన్‌ పరికరం

నిజాంపేట్‌:  కరోనా వైరస్‌ను అరికట్టేందుకు  ప్రగతినగర్‌లోని ఎలీప్‌ పారిశ్రామికవాడలో ఓ స్టార్టప్‌ కంపెనీ జెర్మీబ్యాన్‌ పరికరాన్ని తయారు చేసింది. నియో ఇన్వెంట్రానిక్స్‌ సంస్థ రూపొందించిన ఈ పరికరం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎలాంటి వైరస్‌నైనా 15 నిముషాల్లో నాశనం చేస్తుంది. ఈ పరికరంలో అల్ట్రా వైలెట్‌ కిరణాలతో పాటు  మరికొన్ని ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఈ పరికరం 99.9 శాతం వరకు ఉపరితలం, వాయువులో ఉన్న ఎలాంటి సూక్ష్మ జీవులనైనా చంపేస్తుంది.

దీంతో కరోనా వైరస్‌కు సైతం చెక్‌ పెట్టే సామర్థ్యం ఈ పరికరానికి ఉందని సంస్థ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ జెర్మీబ్యాన్‌ను ఐసోలేషన్‌ కేంద్రాలు, ఆస్పత్రులు, ఇతర సాధారణ ప్రదేశాల్లో ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని రిమోట్‌ ద్వారా నియంత్రించే వెసులుబాటు ఉంది. జెర్మీబ్యాన్‌ను ఆన్‌ చేసినపుడు పరిసర ప్రదేశాల్లో మనుష్యులు ఉండకూడదు. పరికరాన్ని ఆఫ్‌ చేసిన 15 నిముషాల తరువాత మాత్రమే వెళ్లాలి. నియో ఇన్వెంట్రానిక్స్‌ సంస్థకు చెందిన శిరీష చక్రవర్తి ఈ పరికరాన్ని అటల్‌ ఇంక్యూబేషన్‌ సెంటర్, ఎలీప్‌ వీహబ్‌ సహకారంతో తయారు చేశారు. ఈ జెర్మీబాన్‌ పరికరాన్ని మార్చి రూపొందించిన నిర్వాహకులు ఏప్రిల్‌ నెలలో బ్యాక్టీరియా పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం వీరుకున్న సామర్థ్యంతో రోజుకు 10 జెర్మీ బాన్‌లు తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే రోజుకు 50 వరకు పరికరాలను తయారు చేస్తామంటున్నారు. అదే విధంగా రోబొటిక్‌ జెర్మీబాన్, డొమాస్టిక్‌ ఎయిర్‌ స్టెరిలైజర్‌ లను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  

ప్రభుత్వం సహకరించాలి..
ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఈ జెర్మీబ్యాన్‌ లను కరోనా నియంత్రణకు విరివిగా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక్కొ జెర్మీబ్యాన్‌ రూపకల్పనకు రూ.75 వేల నుంచి లక్ష వరకు ఖర్చవుతోంది. అదే విధంగా ఇళ్లల్లో వాడుకునేందుకు డొమెస్టిక్‌ స్టెరిౖలైజర్‌ను తయారు చేస్తున్నాం. మనుషుల అవసరం లేకుండా సంబంధిత ప్రదేశంలో వైరస్‌ను నాశనం చేసే రొబొటిక్‌ జెర్మీబ్యాన్‌ లను  తయారు చేస్తాం.  –  శిరీష చక్రవర్తి, నియో ఇన్వెంట్రానిక్స్‌ నిర్వాహకురాలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top