నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Negligence In Land Records Takes Serious Action Says Collector - Sakshi

గడువులోగా భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలి

తహసీల్దార్లు, ఆర్డీఓలతో సమీక్ష

కలెక్టర్‌ ధర్మారెడ్డి

సాక్షి, మెదక్‌ : నిర్ణీత గడువులోగా  భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తి చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులను హెచ్చరించారు. శనివారం ఆయన కలెక్టరెట్‌లోని సమావేశ మందిరంలో  భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ  ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో జరగడం లేదన్నారు. ఈ పనితీరుతో తహసీల్దార్లు ఏ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారో తెలుస్తుందన్నారు. “డిజిటల్‌ సంతకాలు పూర్తయిన తర్వాత కూడా తప్పులు సరిచేస్తామంటే ఎలా ? అని మండిపడ్డారు.

సంతకాలు చేసేటప్పుడు సరిచేసుకోవాలని తెలియదా? అని ప్రశ్నించారు. ఒకరిద్దరి అజాగ్రత్త వల్ల అందరికి సమస్యలు ఎదురవుతాయని, చివరకు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. మండలం మొత్తంలో వంద సర్వే నంబర్లలో సమస్యలు ఉంటాయని, వాటినికూడా గుర్తించి పరిష్కరించకపోతే ఎలా? అన్నారు. భుజరంపేట గ్రామంలో  సుమారు వెయ్యి ఎకరాలు పార్ట్‌–బీలో  పెట్టారని అక్కడ 150 ఎకరాలు మాత్రమే అసైన్డ్‌ భూమి ఉంటే మొత్తం పార్ట్‌–బీలో ఎందుకు పెట్టారని సంబంధిత తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సమయం పూర్తి కాగానే ఇంటికి వెళ్దాం అనే ధోరణి మార్చుకొని అందుబాటులో ఉండి కార్యక్రమం పూర్తి చేయాలని  ఆదేశించారు. సమావేశంలో జేసీ నగేశ్, డీఆర్‌ఓ రాములు, ఆర్డీఓలు నగేష్, మధు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top