breaking news
Rejuvenation treatment
-
మూసీ సుందరీకరణపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, సాక్షి: మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని.. గత బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీ(sewage treatment plants)ను ఉపయోగించుకుంటే సరిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంటున్నారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జి వద్ద సందర్శనకు వెళ్లిన ఆయన ఆపై మీడియాతో మాట్లాడారు. ‘‘ రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదు . గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన STPలను ఉపయోగించుకుంటే సరిపోతుంది. మా హయాంలో రూ. 4వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31ఎస్టీపీలు నిర్మించాం. .. మూసీ నదీ సుందరీకరణ ప్రాజెక్టుపై ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు. లక్ష 50వేల కోట్లు.. 70వేల కోట్లు.. 50వేల కోట్లు.. అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరగబోతోంది.ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో ఇక రేవంత్ విచారణ.. ఇండియాలో 31ఎస్టీపీలు ఉన్న ఏకైన నగరం హైదరాబాద్. STPలు కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సిటీలో అన్ని ఎస్టీపీలను సందర్శిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేస్తాం. .. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టకుంటే మూసీ నిర్వాసితులకు ఎక్కడ నుంచి ఇస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా?. సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తాం. పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక మాటలే ఒక ఉదాహరణ. ప్రస్తుత ప్రభుత్వం చేసే పనులను బీఆర్ఎస్ గతంలోనే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలు. పబ్లిక్ సిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు’’ అని కేటీఆర్ అన్నారు. -
వ్యయాల పెంపుతో డిమాండ్‌కు పునరుత్తేజం
న్యూఢిల్లీ: కేంద్ర వ్యయాల పెంపు వ్యవస్థలో డిమాండ్ పునరుత్తేజం, పటిష్టతకు అలాగే ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ పేర్కొన్నారు. సిమెంట్, స్టీల్, క్యాపిటల్ గూడ్స్ విభాగాలకు ఈ నిర్ణయం మంచి ప్రయోజనాలను అందిస్తుందని అన్నారు. ప్రత్యక్ష మద్దతు చర్యలు పరిమిత స్థాయిలోనే సానుకూల ప్రభావం చూపిస్తాయని పేర్కొన్న ఆయన, ఆర్థిక వ్యవస్థను స్థిరమైన పద్ధతిలో మెరుగుపరచడానికి దీర్ఘకాలం నుండి మధ్యకాలిక ప్రభావాన్ని కలిగి ఉండే చర్యలు అవసరమని చెప్పారు. ‘‘ఆర్థికాభివృద్ధి, నిర్వహణ వంటి అంశాలు ఏదో ఒక ఏడాదికి సంబంధించి అంశం కాదు. ఇవి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అంశాలతో ఇమిడి ఉంటాయి. ప్రత్యక్ష ఆదాయ మద్దతు స్వల్పకాలిక ప్రయోజనాలకు తగిన విధంగా ఉపయోగపడుతుందనికానీ, మధ్యకాలి, దీర్ఘకాలిక ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. ఇక్కడ మూలధన వ్యయాల కీలకమైనవి. దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలు సమకూర్చుతాయి. ఈ చర్యల వల్ల ముడి పదార్థాలకు డిమాండ్ పెరుగుతుంది. పెట్టుబడుల ప్రక్రియ పురోగమిస్తుంది’’ అని ఆయన అన్నారు. వినియోగ ధోరణి పట్ల దీర్ఘకాలిక రీతిన ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ప్రధానమని ఆయన అన్నారు. పెట్టుబడులకు సంబంధించి మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించి) భారీగా 35.4% పెంచుతూ 2022–23 బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే, 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు బడ్జెట్ పేర్కొంది. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
సాక్షి, మెదక్ : నిర్ణీత గడువులోగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తి చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను హెచ్చరించారు. శనివారం ఆయన కలెక్టరెట్లోని సమావేశ మందిరంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో జరగడం లేదన్నారు. ఈ పనితీరుతో తహసీల్దార్లు ఏ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారో తెలుస్తుందన్నారు. “డిజిటల్ సంతకాలు పూర్తయిన తర్వాత కూడా తప్పులు సరిచేస్తామంటే ఎలా ? అని మండిపడ్డారు. సంతకాలు చేసేటప్పుడు సరిచేసుకోవాలని తెలియదా? అని ప్రశ్నించారు. ఒకరిద్దరి అజాగ్రత్త వల్ల అందరికి సమస్యలు ఎదురవుతాయని, చివరకు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. మండలం మొత్తంలో వంద సర్వే నంబర్లలో సమస్యలు ఉంటాయని, వాటినికూడా గుర్తించి పరిష్కరించకపోతే ఎలా? అన్నారు. భుజరంపేట గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాలు పార్ట్–బీలో పెట్టారని అక్కడ 150 ఎకరాలు మాత్రమే అసైన్డ్ భూమి ఉంటే మొత్తం పార్ట్–బీలో ఎందుకు పెట్టారని సంబంధిత తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సమయం పూర్తి కాగానే ఇంటికి వెళ్దాం అనే ధోరణి మార్చుకొని అందుబాటులో ఉండి కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ నగేశ్, డీఆర్ఓ రాములు, ఆర్డీఓలు నగేష్, మధు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
మన తొలి డాక్టర్లు
నేడు డాక్టర్స్ డే కాయకల్ప చికిత్సల నాటి కాలం నుంచి నేడు కార్పొరేట్ చికిత్సలు పొందుతున్నాం. చిట్కా వైద్యాల కాలం నుంచి మోడరన్ మెడిసిన్ వైపు పురోగమిస్తున్నాం. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాక ముందు మనకు వైద్యులే లేరా? బీసీనాటి కాలంలో భిషగ్వరులే లేరా? ఉన్నారు! అనాదిగా జరిగిన పరిశోధనలతో మన వైద్యశాస్త్రాన్ని పరిపుష్ఠం చేసిన మన పూర్వ ఆయుర్వేద డాక్టర్లలో కొందరి గురించి కొంత... వారు చెప్పిన అంశాల్లో నేటికీ పాటిస్తున్న వివరాల గురించి మరికొంత... చరకుడు మన భారతీయ వైద్యానికి మూలపురుషులుగా భావించే వారిలో చరకుడు ఒకరు. ఆయన జీవించిన కాలం క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం. నిజానికి అంతకు ముందు నుంచీ వైద్యచికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 10వ శతాబ్దంలోనే పునర్వస ఆత్రేయుడు మౌఖికంగా వైద్యచికిత్సల గురించి చెబుతూ ఉండగా అగ్నివేశుడు అనేక అంశాలను గ్రంథస్తం చేసినట్లు దాఖలాలు ఉన్నాయి. అయితే వాటిలోని చాలా విషయాలను క్రీ.పూ. రెండో శతాబ్దంలో చరకుడు సంస్కరించారు. ఆ తర్వాత దృఢబలుడు అనే వైద్యనిపుణుడు సైతం అందులోని అనేక విషయాలను సమీక్షిస్తూ మళ్లీ సంస్కరించారు. అయితే తొలినాటి చరకుడి పేరిటే ఆ వైద్యశాస్త్రమంతా చెలామణీ అయ్యేలా దృఢబలుడు గౌరవించాడు. దాంతో ఆ వైద్యగ్రంథమంతా ‘చరకసంహిత’గానే ప్రఖ్యాతి పొందింది. అనేక వైద్యశాఖలకు చెందిన విషయాలను ఒకే చోట చెప్పారు కాబట్టే వాటిని ‘సంహిత’గా ప్రస్తావించారు. చరక సంహితలో పేర్కొన్నవే అయినా ఆధునిక వైద్యం కూడా ఇప్పటికీ పాటిస్తున్న అంశాల్లో కొన్ని... * ఆమలకీ (ఉసిరికాయ) తింటే శతాయుష్షు కలుగుతుంది. రోగనిరోధక శక్తిని కలిగించే విటమిన్-సి పుష్కలంగా దొరికే స్వాభావికమైన పదార్థాలలో ఉసిరి చాలా ప్రధానం. అందుకే ఉసిరికాయతో వ్యాధులన్నీ దూరం. * ఆధునికభాషలో చెప్పాలంటే సంభోగశక్తి పెంచే మందులను ఆఫ్రోడెసియాక్స్ అంటారు. ఆయుర్వేదంలో దీనికి ఓ ప్రత్యేక శాస్త్రం ఉంది. దాని పేరే ‘వాజీకరణం’. ఇందులోని అనేక వైద్యచికిత్సలను ఆయుర్వేద వైద్యులు ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఉదాహరణకు పిప్పరీక్షీరం, యష్టిమధుచూర్ణం, శతావరిఘృతం. * పక్షవాతానికి ‘వస్తి’కర్మ అనే ప్రక్రియను ప్రయోగించి ఫలితాలు సాధించాడు చరకుడు. కషాయాలను శరీరంలోకి పంపే నిరూహవస్తి, ఔషధతైలాలతో చికిత్స చేసే అనువాసనవస్తి... ఈ రెండిటికీ మరో మూడు చికిత్సలు (వమన, విరేచన, నస్య) జోడించి... మొత్తం ఐదుగా కూర్చి వాటిని ‘పంచకర్మ’ చికిత్సలు అంటూ ఇప్పటికీ అనుసరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. * విషపదార్థాలను టాక్సిన్స్ అంటారన్న విషయం తెలిసిందే. అవే విషాలను ప్రమాదకరం కాని విధంగా చాలా కొద్ది మోతాదుల్లో తీసుకుంటే అమృతమవుతాయని చెప్పాడు చరకుడు. ఎన్నో వైద్య విధానాల్లో ఈ మార్గం ఇప్పటికీ అనుసరణీయం. వాగ్భటుడు చరక సుశ్రుత కాశ్యప సంహితల్లోని ముఖ్యాంశాలను సంక్షిప్తం చేసి, మరికొన్ని శాస్త్రాలను మిళితం చేసి సరళీకృతమైన సంస్కృతంలో అందించిన గ్రంథాలే... ‘అష్టాంగ సంగ్రహం’, ‘అష్టాంగ హృదయం’ . వీటిలో మొదటిదాన్ని రాసింది వృద్ధ వాగ్భటుడు. రెండోది రాసినవాడు లఘువాగ్భటుడు. వీటినే ‘వాగ్భట సంహిత’లని అంటారు. ఈ సంహితల్లో జ్వరాలను తగ్గించే ఎన్నో కష్టాలను పేర్కొన్నారు. త్రిదోషాల్లో ఒకటైన శ్లేషాన్ని (కఫం) అవలంబక, క్లేదక, బోధక, శ్లేషక, శ్లేష్మాలు అంటూ ఐదు రకాలుగా విభజించిన ప్రత్యేకత వీరిది. చరక, సుశ్రుత, వాగ్భటులను వృద్ధత్రయం అంటారు. సుశ్రుతుడు చరకసంహిత లాగే సుశ్రుతుడి పేరు పెట్టుకున్న అనేక వైద్యవిధానాలను పేర్కొన్న ఇది కూడా అనేకమంది వైద్యులు తమ పరిజ్ఞానాన్ని పొందుపరిచిన గ్రంథం. ఇందులో ఇద్దరు సుశ్రుతులున్నారు. ఒకరు వృద్ధ సుశ్రుతుడు. ఈయన ‘దివోదాస ధన్వంతరి’ అనే వైద్యుడి శిష్యుడు. వీరి కాలం సుమారు 10-15 బీసీ. వీరు రచించిన గ్రంథమే సుశ్రుతసంహిత. అయితే దీన్ని మరొక సుశ్రుతుడు (ఆయన కాలం క్రీ.శ. రెండో శతాబ్దం) సంస్కరించాడు. ఆ తర్వాత క్రీ.శ. ఐదో శతాబ్దంలో నాగార్జునుడు దీనికి ‘ఉత్తర తంత్రాన్ని’ చేర్చాడు. ఆధునిక వైద్యశాస్త్రంలో శస్త్రచికిత్సగా పేర్కొనే సర్జరీ ప్రక్రియను సుశ్రుత సంహితలో నిపుణులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స చేసే ఎన్నో ఉపకరణాలనూ, శస్త్రాలనూ వారు వర్ణించారు. వారు పేర్కొన్నవీ... ఆధునిక శస్త్రచికిత్సల్లో ఉపకరించేవీ అయిన ఉపకరణాలు ఉదాహరణకు కొన్ని... జలోదర యంత్ర అంటే... అసైటిస్ కాన్యులా అర్ధధార శస్త్ర (స్కాల్పెల్) పూర్ణగర్భవతి మరణిస్తే, పొట్టలో కదలికలు కనిపిస్తే అప్పుడు ఉదరచ్ఛేదనం చేసి శిశువును వెలికి తీయవచ్చని ఆయుర్వేదం చెబుతుంది. ‘‘వస్తమార విపన్నాయాః కుక్షి ప్రస్పందతేయది, తక్షణాత్ జన్మకావే తత్పాటయిత్వా ఉద్ధరేత్ భిషక్’’ చికిత్సకు లొంగని కొన్ని పుండ్ల (దుష్టవ్రణాలు) విషయంలో జలగలను ప్రయోగించి సత్ఫలితాలను రాబట్టారు. మోడ్రన్ మెడిసిన్‌లో లీచ్ థెరపీ అని పేర్కొనే విధానం ఇది. భగందరవ్యాధి (ఫిస్టులా)కి క్షారసూత్ర ప్రక్రియ ద్వారా ఫలితం ఉంటుందని నిరూపించాడు. ఇప్పటికీ చాలామంది ఆధునిక శస్త్రకారులు సైతం ఈ ప్రక్రియను ప్రయోగిస్తున్నారు. మరి కొంతమంది కశ్యప కశ్యప సంహిత అని పేరొందిన వైద్యశాస్త్ర అంశాలను మరీచి కశ్యపుడు అనే నిపుణుడు బోధిస్తుండగా ‘వృద్ధజీవకుడు’ అనే ఆయన రాశారు. దీన్నే ‘వృద్ధజీవకతంత్రం’గా పేర్కొంటారు. దీన్నే కాశ్యపసంహిత అని కూడా అంటారు. ఈ సంహిత క్రీ.పూ. ఆరోశతాబ్దికి చెందింది. ఇక్కడ పేర్కొన్న కశ్యపుడితో బాటు చరిత్రలో ఇతర కశ్యపులూ ఉన్నారు. ఈ కశ్యపుల్లో ఒకరు ‘కౌమారభృత్య’ నిపుణుడు. అంటే ప్రసూతి చికిత్సలు, స్త్రీ సంబంధిత రోగాల ప్రత్యేక నిపుణుడు అని అర్థం. ‘కౌమరభృత్యం’ అంటే స్త్రీలకు, శిశువులకు చెందిన ప్రత్యేక విభాగాలకు చెందిన శాస్త్రపరిజ్ఞానం అన్నమాట. ఇందులో శిశువు శారీరక, మానసిక వికాస వివరాలు (గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మైల్‌స్టోన్స్) ఉన్నాయి. గర్భణీ పరిచర్యలనూ (యాంటీనేటల్ కేర్) వివరించారు. ఆధునిక కాలంలో ఇమ్యూనైజేషన్‌ను పోలిన కొన్ని ప్రక్రియలనూ ఈ విభాగంలో వివరించారు. ఇక వృద్ధత్రయం లాగే లఘుత్రయంలోనూ ముగ్గురు వైద్యనిపుణులున్నారు. వారు క్రీ.శ. ఏడో శతాబ్దానికి చెందిన మాధవకరుడు, పదమూడో శతాబ్దానికి చెందిన శారంగధరుడు, పదహారో శతాబ్దానికి చెందిన భావమిశ్రుడు. మాధవకరుడు ఈయన మాధవనిదానం అనే గ్రంథాన్ని రాశాడు. మాధవకరుడు ఆమవాత (రుమాటిక్ ఆర్థరైటిస్), అమ్లపిత్త (హైపర్ అసిడిటీ/ గ్యాస్ట్రైటిస్) పరిణామశూల (పెప్టిక్ అల్సర్స్) వ్యాధులు, వాటి చికిత్సలను విశదీకరించాడు. శారంగధరుడనే పండితుడు రాసిన గ్రంథానికి శారంగథర సంహిత అని పేరు. దీనికి కూడా మంచి ప్రామాణికత ఉంది. లఘుత్రయంలో శారంగధరుడు కూడా మంచి పేరు గడించాడు. సిద్ధనాగార్జునుడు వనాల నుంచి లభ్యమయ్యే ఔషధ ద్రవ్యాల చికిత్సలో ఉండే కష్టనష్టాలను అధిగమించడానికి మన తెలుగు రాష్ట్రాలలోని శ్రీశైలం ప్రాంతాలలో దొరికే ఖనిజధాతులను శుద్ధి చేసి, ఔషధాలుగా రూపొందించడానికి బాటలు వేశాడు. నిజానికి ఇది ఆయుర్వేదంలో విప్లవశకం. దీన్ని రసశాస్త్ర విప్లవంగా పేర్కొన్నవచ్చు. ‘రస’ అంటే ఇక్కడ పాదరసం. అలాగే రకరకాల ఔషధ నిర్మాణ పద్ధతులనూ (ఫార్మస్యూటికల్ మెథడ్స్) కూడా ప్రస్తావించాడు. ప్రతి మందుకూ మోతాదు (డోసేజ్) నిర్ణయించాడు. భావమిశ్రుడు ఆయుర్వేదంలో పచ్చిమిరపకాయను ప్రవేశపెట్టినది భావమిశ్రుడే. అంతవరకు కారానికి మిరియాలు (మరీచ) వాడటం మాత్రమే ఉండేది. ఫిరంగి రోగాన్ని (సిఫిలిస్)ను గుర్తించాడు. ఎన్నో విలువైన వైద్య పరిశోధనలలో పాలుపంచుకున్న మన పూర్వవైద్యులలో వీరు కొందరు మాత్రమే! ఆ కాలంలోనూ కొందరు కొన్ని ప్రత్యేక వైద్య విభాగాలలో సైతం నైపుణ్యం సాగించారు. ఉదాహరణకు చరకుడు కాయ చికిత్స (జనరల్ మెడిసిన్), సుశ్రుతుడు శల్యతంత్రం (జనరల్ సర్జరీ), కశ్యపుడు కౌమారభృత్య (శిశువైద్యం లేదా పీడియాట్రిక్స్) వంటి వాటిల్లో నైపుణ్యం సాగించారని ప్రతీతి. అయితే వారు వైద్యశాస్త్ర అంశాలన్నింటినీ ఒకే గ్రంథంగా ఒకేచోట కూర్చారు. దాంతో ఆ వైద్యశాస్త్ర గ్రంథాలు ప్రత్యేక విభాగాలుగా గాక... కూర్పు చేసిన పుస్తకాలను సూచించే విధంగా సంహితలు అని పేరొందాయి. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్