డిగ్రీ కాలేజీలు, వర్సిటీల్లోనే నాలుగేళ్ల బీఎడ్‌

NCTE requested to give Government opinion about Bachelor of Education - Sakshi

ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియాలని కోరిన ఎన్‌సీటీఈ

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కోర్సును ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ను పరిగణనలోకి తీసుకొని దేశంలో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు కొత్త కోర్సులను 2020–21 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తేవాలని భావిస్తోంది. అందులో నాలుగేళ్ల బీఎడ్‌ కోర్సును, సైన్స్, హ్యుమానిటీస్‌లో డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టేందుకు వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ఆ కోర్సులను నిర్వహిస్తారా? లేదా? అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలియజేయాలని ఎన్‌సీటీఈ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి ఎన్‌సీటీఈ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ సత్‌బిర్‌ బేడీ లేఖ రాశారు. ఈనెల 16వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని అందులో కోరారు. దీంతో ఆ దిశగా ఉన్నత విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈనెల 15వ తేదీన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చింది. 

ఇప్పటికే అధికంగా కాలేజీలు.. 
రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కళాశాలలు ఇప్పటికే అధికంగా ఉన్నాయని, కొత్తగా కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే ఎన్‌సీటీఈకి తెలియజేసింది. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది బీఎడ్, డీఎడ్‌ వంటి ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారని, కొత్త కాలేజీల నుంచి వచ్చే వారితో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని పేర్కొంది. అంతేకాదు రాష్ట్రానికి కావాల్సిన మేరకు శిక్షణ పూర్తి చేసిన వారు ఉన్నారని, అయితే ఇకపై నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించాల్సి ఉన్నందున కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని అప్పట్లో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలా? వద్దా? వాటిని నిర్వహిస్తామంటూ దరఖాస్తు చేసుకునే కాలేజీల నుంచి దరఖాస్తులను స్వీకరించాలా? వద్దా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కోరింది.  

యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లోనే.. 
ఉపాధ్యాయ విద్యా బోధనలో నాలుగేళ్ల బీఎడ్‌ ద్వారా మెరుగైన శిక్షణ, నాణ్యమైన విద్యా బోధనకు చర్యలు చేపట్టవచ్చన్న ఆలోచనతో వీటిని ప్రవేశ పెట్టేందుకు ఎన్‌సీటీఈ చర్యలు చేపట్టింది. వాటికోసం కొత్తగా కాలేజీలు ఏర్పాటు చేస్తామంటే ఇవ్వమని పేర్కొంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top