మెదక్ ఎంపీ అభ్యర్థిగా నాయిని... రమణాచారి? | Sakshi
Sakshi News home page

మెదక్ ఎంపీ అభ్యర్థిగా నాయిని... రమణాచారి?

Published Sat, May 17 2014 11:49 AM

మెదక్ ఎంపీ అభ్యర్థిగా నాయిని... రమణాచారి? - Sakshi

తెలంగాణ సీఎం పదవి చేపట్టనున్న కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నారు. దాంతో మెదక్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలి అనే అంశంపై కేసీఆర్ పార్టీ నాయకులతో తీవ్రంగా చర్చిస్తున్నారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డిని ఆ స్థానం నుంచి పోటీలోకి దింపాలని కేసీఆర్ భావించారు. అయితే అందుకు నాయినీ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం.

 

తాను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కావాలని భావిస్తున్నానని... తనకు ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తే తద్వారా మంత్రిగా రాష్ట్రానికి సేవ చేసుకోవాలని భావిస్తున్నట్లు నాయిని తన మనసులోని మాటను కేసీఆర్ ముందు ఉంచినట్లు సమాచారం. దాంతో మెదక్ ఎంపీగా సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరి కొద్ది సేపట్లో తెలంగాణ భవన్ లో  టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఈ అంశంపై వారితో చర్చించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement