ఎమ్మెల్యే అయ్యారు.. ఎంపీ అయ్యారు !

Nalgonda TDP And TRS MLA Elected Parliament - Sakshi

ప్రజల మదిలో నిలిచిపోయారు 

ఉమ్మడి జిల్లానుంచి ఏడుగురు

అసెంబ్లీ , పార్లమెంట్‌లోకి అడుగు

సాక్షి, యాదాద్రి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగారు. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికై తమ పదవులకు వన్నె తెచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వారిలో ఉమ్మడి జిల్లానుంచి రావినారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం శ్రీనివాసరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రవీంద్రనాయక్‌ ఉన్నారు. 

ఎం. రఘుమారెడ్డి
టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎం. రఘుమారెడ్డి 1984లో నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. అనంతరం 1989లో నల్లగొండ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రభంజనంలో గెలిచిన ఆయన ప్రజలకు చేరువయ్యారు. 

రవీంద్రనాయక్‌
గిరిజన నాయకుడు రవీంద్రనాయక్‌ 1978, 1983లో దేవరకొండ ఎమ్మెల్యేగా గెలిచారు.  కొంతకాలం క్రియాశీలక రాజకీయలకు దూ రంగా ఉన్నారు. 2004లో వరంగల్‌ ఎంపీగా టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. 

 రావి నారాయణరెడ్డి
1952 ఎన్నికల్లో పీడీఎఫ్‌ తరఫున భువనగిరి అసెంబ్లీ, నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి రావి నారాయణరెడ్డి రెండు చోట్ల విజయం సాధించారు. వెంటనే భువనగిరి ఆసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. అనంతరం 1957లో భువనగిరి ఎమ్మెల్యేగా రావి విజయం సాధించారు. 1962లో మరోసారి నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. మొదటిసారి ఎంపీగా గెలిచినపుడు దేశంలో అత్యధిక మెజార్టీ సాధించడంతో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు రావినారాయణరెడ్డికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పార్లమెంట్‌ నూతన భవనాన్ని రావినారాయణరెడ్డి చేత ప్రారంభింపజేయడం విశేషం.

 బొమ్మగాని ధర్మభిక్షం
సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి1952లో ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మభిక్షం, 1962లో  నల్లగొండ నుంచి 1967లో  నకిరెకల్‌ నియోజకవర్గం నుంచి  ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1991, 1996లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. చేతి వృత్తుల వారి సంక్షమం కోసం నిరంతరం పాటు పడే నాయకునిగా ఆయనకు పేరుంది. 

 బీంరెడ్డి నర్సింహారెడ్డి
1957లో సూర్యాపేట, 1967లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి శాసనసభ సభ్యుడిగా గెలుపొందిన బీంరెడ్డి నర్సింహారెడ్డి, 1971, 1984లో వరుసగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. పీడిత ప్రజల సమస్యలు, భూపోరాటలతో ఆయన జీవితం ప్రజాసేవకే అంకితమైంది. 

 పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి
మునుగోడు నియోజకవర్గం నుంచి 5 సార్లు 1967,1972,1978,1983,1999లో ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి గతేడాది వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ చనిపోయారు. 2009 ఎన్నికల్లో ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 

 చకిలం శ్రీనివాసరావు
నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన చకిలం శ్రీనివాసరావు 1967, 1972 నల్లగొండ నుంచి రెండు సార్లు, 1983లో మిర్యాలగూడ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top