సంచలన కేసు.. నల్లగొండ సీఐ అదృశ్యం | Nalgonda CI Venkateshwarlu disappear | Sakshi
Sakshi News home page

సంచలన కేసు.. నల్లగొండ సీఐ అదృశ్యం

Feb 3 2018 2:14 AM | Updated on Oct 16 2018 6:15 PM

Nalgonda CI Venkateshwarlu disappear - Sakshi

నల్లగొండ క్రైం: సంచలనం సృష్టించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసు విచారణాధికారి, నల్లగొండ టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యమవ్వడం కలకలం సృష్టించింది. పాలకూరి రమేశ్‌ హత్య కేసు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచిన అనంతరం సీఐ వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయారు.

ఈయన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త హత్య కేసు విచారణ అధికారి కావడంతో రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. శ్రీనివాస్, పాలకూరి రమేశ్‌ హత్యలతో సీఐపై పనిభారం పెరిగిపోయింది. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం ప్రదర్శించారని ఉన్నతాధికారులు మందలించినట్టు తెలిసింది. అయితే సీఐ తన సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని వెల్లడించి తీవ్ర మనోవేదనకు గురైనట్టు సమాచారం. శ్రీనివాస్‌ హత్య కేసులో కొందరు నిందితులకు బెయిల్‌ రావడంతో ఉన్నతాధికారులు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.  

మాడ్గులపల్లి పీఎస్‌లో సిమ్‌ కార్డు ఇచ్చి... 
మానసిక ఒత్తిడిలో ఉన్న సీఐ తన వద్దనున్న ఆయుధాన్ని డ్రైవర్‌కు, మాడ్గులపల్లి పోలీస్‌స్టేషన్‌లో సిమ్‌కార్డును అప్పగించి వెళ్లిపోయారని తెలిసింది. ఉదయం ఓ సీఐ ఫోన్‌ చేసినా సీఐ వెంకటేశ్వర్లు రిసీవ్‌ చేసుకోలేదని సమాచారం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపడంతో సీఐ అదృశ్యమయ్యాడనే వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించింది. సీఐ వ్యక్తిగత ఫోన్‌కూడా స్విచ్చాఫ్‌ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.  

30 రోజులు సెలవు కావాలని.. 
తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న సీఐ వెంకటేశ్వర్లు.. తనకు నెల రోజులు సెలవు కావాలని డీఎస్పీకి విన్నవించారు. అయితే ప్రస్తుతం సెలవులు ఇవ్వలేమని, మరో వారం తర్వాత పరిశీలిస్తామని ఉన్నతాధికారులు తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఐ మనస్తాపం చెంది చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. సంచలన హత్య కేసుల విచారణాధికారి అదృశ్యం కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, సీఐ క్షేమంగా ఉన్నట్లు బంధువులు జిల్లా ఎస్పీని కలసి చెప్పినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement