నాగోల్‌ ఆర్టీఏ స్పెషల్‌.. వాహనాలకు మురుగు టెస్ట్‌

nagole rta office Full Filled With Drinage Water - Sakshi

మురుగు నీట ఆర్టీఏ ప్రాంగణం  

ఉప్పొంగిన నాలా మునిగిపోయిన డ్రైవింగ్‌ ట్రాక్‌లు

తనిఖీల్లో పట్టుబడిన  వాహనాలు కూడా మునక..

నాలుగు రోజులుగా  నిలిచిపోయిన డ్రైవింగ్‌ టెస్ట్‌లు

దుర్వాసనతో అష్టకష్టాలు  నివారణ చర్యలు తీసుకోని అధికారులు   

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళితే ఏం చేస్తారు..? ముందు వంకరటింకర ట్రాక్‌పై టెస్ట్‌లు పెడతారు. ఎగుడుదిగుడు రోడ్డుపైనా డ్రైవింగ్‌ నైపుణ్యం పరీక్షిస్తారు. కానీ నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయంలో వీటికి అదనంగా ‘ముగురు టెస్ట్‌’ కూడా పెడతారు. మోకాల్లోతు నీటిలో వాహనాలను పరుగులు పెట్టించేవారికే లైసెన్స్‌ ఇస్తారన్నమాట..!   
 
లైసెన్స్‌ లేదనో.. ఇన్సూరెన్‌ చేయించలేదనో.. లేక సరైన వాహన పత్రాలు లేవనో నాగోల్‌ ఆర్టీఏ అధికారులు పట్టుకెళ్లిన వాహనాలకుకూడా మురుగు టెస్ట్‌లు చేస్తున్నారు. కావాలంటే ఒక్కసారి నాగోల్‌ ఆర్టీఏకు వెళ్లి చూడండి.. పట్టుబడిన మీ వాహనాల పరిస్థితిని తెలుసుకోంది. ఎందుకంటే వివిధ కేసుల్లో సీజ్‌ చేసి నాగోల్‌ ఆర్టీఏ ప్రాంగణంలో ఉంచిన ఆటోలు, బైకులు, కార్లు నాలుగు రోజులుగా మురుగు నీటిలో నానుతున్నాయి.  

సాక్షి, సిటీబ్యూరో: ప్రతి రోజు వందలాది మందికి డ్రైవింగ్‌ పరీక్షలు పెట్టి లైసెన్సులు జారీ చేసే నాగోల్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ సైతం నీటిలో మునిగిపోయింది. ట్రాక్‌లు, వాహనాల స్క్రాబ్‌యార్డు, కొత్తవాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేసే కార్యాలయంతో సహా పలు కేంద్రాలు నాలుగు రోజులుగా నీటోలోనే మునిగి ఉన్నాయి. దీంతో పలు ట్రాక్‌లలో డ్రైవింగ్‌ పరీక్షలు నిలిపివేశారు. మోటారు వాహన నిబంధనల మేరకు స్వాధీనం చేసుకున్న సుమారు 500  వాహనాల్లో చాలా వరకు నీట మునిగాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రైవేట్‌ బస్సులు, లారీలు, డీసీఎంలు, తదితర ఖరీదైన వాహనాలు సైతం ఇందులో ఉన్నాయి. మరోవైపు ట్రాక్‌  అంతా దుర్వాసన వ్యాపించింది.  

నాలా ఉప్పొంగిన ప్రతిసారీ ఇంతే..  
హైదరాబాద్‌లోనే అతి పెద్ద పరీక్షా కేంద్రమైన నాగోల్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌కు చుట్టుపక్కల ఉన్న కాలనీల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతున్నప్పటికీ  ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులు కానీ, అటు రవాణాశాఖ ఉన్నతాధికారులు గానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా ఈ సమ స్యపై ఆర్టీఏ నుంచి  ఫిర్యాదు అందని కారణంగా జీహెచ్‌ఎంసీ పట్టించుకోలేదు. మురుగునీటిని తొలగించడం తమ విధి కాదన్నట్లుగా రవాణా అధికారులు భావించడం వల్ల 12 ఎకరాల విస్తీర్ణంలో 6 డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టించిన నాగోల్‌ ట్రా క్‌లో సగానికిపైగా నీటిలో మునిగిపోయింది.

ఏటా ఇదే దుస్థితి...
శాస్త్రీయమైన పద్ధతిలో, రహదారి భద్రతా నిబంధనలకు అనుగుణంగా  డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించి వాహనదారులకు లైసెన్సులు జారీచేసేందుకు 2005లో నాగోల్‌ ట్రాక్‌ను నిర్మించారు. రాష్ట్రంలో ఈ తరహా ట్రాక్‌ పరీక్షలు మొదట ఇక్కడే మొదలయ్యాయి. రహదారులపై ఉండే మిట్టపల్లాలు, మలుపులు తదితర డ్రైవింగ్‌ టెస్ట్‌లకు అనుగుణంగా ఇక్కడ ట్రాక్‌లు నిర్మించారు. ఇలాంటి అతి పెద్ద ట్రాక్‌లో చాలాకాలంగా మురుగు నీరు చేరుతూనే ఉంది. అటు ఎల్‌బీనగర్‌ నుంచి ఇటు ట్రాక్‌కు దిగువన ఉన్న ఆదర్శనగర్‌ వరకు కనీసం 10 కాలనీల మురుగునీరు అంతా ఒకే నాలా నుంచి ప్రవహిస్తుంది. ఈ నాలా ఉప్పొంగిన ప్రతిసారీ ట్రాక్‌ మునిగిపోతుంది. ‘ఎలాంటి భారీ వర్షాలు లేవు. వరదలు లేవు. కానీ మురుగునీరు మాత్రం ట్రాక్‌ను ముంచేస్తుంది’.. అని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఇదే పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ శాశ్వత పరిష్కార చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.  

నిలిచిపోయిన సేవలు..
ప్రస్తుతం నాగోల్‌ ట్రాక్‌లో ‘హెచ్‌’ ఆకృతిలో ఉన్న 2 ట్రాక్‌లు, మరో ద్విచక్ర వాహన ట్రాక్‌ మురుగుతో నిండిపోయాయి. దీంతో వాహనదారుల డ్రైవింగ్‌ పరీక్షలు స్తంభించాయి. మొత్తం 6 ట్రాక్‌లలో మూడింటిలో మురుగు చేరడంతో మిగతా ముడూ ట్రాక్‌లలోనే పరిమితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మలక్‌పేట్‌ ఆర్టీఏ కార్యాలయానికి చెందిన రిజిస్ట్రేషన్‌ పనులకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రతి రోజు మలక్‌పేట్‌కు చెందిన సుమారు 200 కొత్త వాహనాలకు నాగోల్‌లో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అలాగే పాతవాటికి ఫిట్‌నెస్‌ ధృవీకరిస్తారు. ప్రస్తుతం  ఆర్సీ కార్యాలయం, వాహనాలకు పరీక్షలు నిర్వహించే షెడ్డు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు రోజులుగా నాగోల్‌ ట్రాక్‌ నీటిలో మునిగి ఉన్న విషయం ఆర్టీఏ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టనట్టు వ్యవహరించడం వినియోగదారులకు అందజేసే పౌరసేవల్లోని డొల్లతనాన్ని ప్రతిబింబిస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top