ట్రావెల్‌.. మొబైల్‌

Most of People Using Smart Phone in Tour And Travels - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పొద్దున్న లేవగానే చేతిలో ఫోన్‌ ఉందో లేదో చూడడం...రాత్రి పడుకునే ముందు కూడా పక్కనే దాన్ని కూడా బజ్జోపెట్టడం మామూలైందిప్పుడు. అంతగా మన జీవితంతో మమేకమైపోయిన మొబైల్‌ ఫోన్‌..ఇష్టమైన పర్యటనలు చేస్తున్న సమయంలో కూడా మనల్ని వీడడం లేదు. అయితే మన హాలిడే ట్రిప్స్‌లో ఫోన్‌ ప్రభావం ఎంత అంటే... ప్రయాణాల్లో కూడా మొబైల్‌ ఫోన్‌ తప్పనిసరిగా వినియోగిస్తాం అని చెబుతున్నారు జర్నీఇష్టులు. అంతేకాదు స్మార్ట్‌ ఫోన్‌ లేకపోతే తమ జర్నీ చాలా చప్పగా ఉంటుందంటున్నారు. హోటల్స్‌ డాట్‌ కామ్‌ నిర్వహించిన మొబైల్‌ ట్రావెల్‌ ట్రాకర్‌ సర్వే వెల్లడించిన విషయమిది. దాదాపుగా 30 దేశాలకు చెందిన 9 వేల మందిని సర్వే చేసి ఈ ఫలితాలను వెల్లడించారు. 

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం తాము కనీసం 4 గంటలపైనే మొబైల్‌ఫోన్‌తో గడుపుతామని అంగీకరించారు. బీచ్‌లో సుందర దృశ్యాల కంటే మిన్నగా మొబైల్‌ స్క్రీన్‌లో విశేషాలు తిలకిస్తామన్నారు. మరి సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండేవాళ్లు ఏం చేస్తున్నారంటే..చుట్టు పక్కల కనిపించే సుందర దృశ్యాల సంగతేమో గానీ 64 శాతం మంది తాము తింటున్న ఫుడ్‌ ఫొటోలు తీస్తున్నామని చెప్పారు. 18 నుంచి 29 మధ్య వయస్కులలో 85 శాతం మంది తాము అడుగుపెట్టిన నగరపు విశేషాల చిత్రాల కంటే సెల్ఫీలనే అప్‌లోడ్‌ చేస్తున్నామన్నారు. అంతేకాదు తమకు ప్రయాణాల్లో తోడు లేకపోయినా పర్లేదు కానీ... మొబైల్‌ ఉండాల్సిందే అంటున్నవారు 31 శాతం మంది ఉండడం గమనార్హం. అయితే విచిత్రమేమిటంటే...స్మార్ట్‌ ఫోన్స్‌ బాగా అందుబాటులోకి రావడం వల్లనే విహారయాత్రలు, హోటల్స్‌లో బసలు బాగా పెరిగాయని 71 శాతం మంది భారతీయ ట్రావెలర్లు అభిప్రాయపడడం. వీరిలో కూడా 58 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేకపోతే తమ ప్రయాణం ఆనందం కలిగించడం లేదంటున్నారు. ప్రయాణాల్లో అన్నింటికన్నా తమకు అత్యంత చిరాకు కలిగించే విషయాల్లో మొబైల్‌ ఫోన్‌ చార్జింగ్‌ అయిపోవడం మొదటిది అని అత్యధికులు చెప్పడం కొసమెరుపు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top