
'మీకు దండం పెడతా..'
'మీకు దండం పెడతా.. ప్రజల సమస్యల్ని వెంటనే పరిష్కరించండి.
హైదరాబాద్: 'మీకు దండం పెడతా.. ప్రజల సమస్యల్ని వెంటనే పరిష్కరించండి.. లేకుంటే మీ కార్యాలయాల ఎదుట ప్రజలతో కలసి ధర్నాకు దిగాల్సి వస్తుంది..' అని అధికారులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్.11లో అక్కడి నివాసితులతో కలిసి గురువారం ఆయన సమావేశమయ్యారు. ఎన్నిసార్లు సమావేశాలు పెట్టి చెప్పినా సమస్యలు పరిష్కారం కావటం లేదని.. ఈ సందర్భంగా అధికారుల తీరుపై స్థానికులు మండిపడ్డారు. ముఖ్యంగా వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్య ధోరణిని స్థానికులు ఎమ్మెల్యే చింతల ముందే ఎండగట్టారు. నీళ్లు రావడం లేదని, డ్రైనేజి పొంగిపొర్లుతోందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని వారు ఎమ్మెల్యేకు తెలిపారు.
వీటన్నింటినీ విన్న ఎమ్మెల్యే.. ఎన్నిసార్లు మొత్తుకోవాలంటూ అధికారులను ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకపోతే వాటర్‌వర్క్స్ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించారు. 'మీరుండీ ఏం ప్రయోజనం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్‌వర్క్స్ జీఎం రమణారావు, బంజారాహిల్స్ వాటర్‌వర్క్స్ డీజీఎం యోగానంద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
(బంజారాహిల్స్)