వీణావాణిలను పరామర్శించిన మంత్రి తుమ్మల

వీణావాణిలను పరామర్శించిన మంత్రి తుమ్మల

హైదరాబాద్‌: అవిభ‌క్త క‌వ‌లలైన ప‌ద‌మూడేళ్ల వీణావాణిల‌ గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ క‌న‌బ‌రుస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నిలోఫ‌ర్ ఆస్పత్రి నుంచి స్టేట్ హోంకు వ‌చ్చిననాటి నుంచి వారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారని, వారిది ప్రత్యేక ప‌రిస్థితి కావడంతో స‌ర్కారు కూడా వారిని అంతే ప్రత్యేకంగా కంటికి రెప్పలా చూసుకుంటోందని చెప్పారు. వారి చదువుకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం కల్పించింది. వీరి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఆదేశించడంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ వారి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు.

 

వారి బాగోగుల కోసం ఏకంగా రూ.6.46 లక్షలను కేటాయించారు. ఈ మొత్తంలో వారిని అనుక్షణం జాగ్రత్తగా చూసుకునే అయాలకే రూ.4.32 లక్షలను కేటాయించారు. వారికి చదువులు చెప్పే కౌన్సిలర్ కోసం రూ.1.14 లక్షలు, నిర్వహణ కోసం మరో రూ.లక్ష కేటాయించారు. వీణావాణిల స్థితిగతులపై మంత్రి తుమ్మల ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ప‌లుమార్లు స్టేట్ హోంను సంద‌ర్శించిన మంత్రి శుక్రవారం మ‌రోమారు వచ్చి వీణావాణిలను ప‌ల‌క‌రించారు. వారితో కాసేపు మాట్లాడి వారికి ఇంకేమి కావాలో అడిగి తెలుసుకున్నారు. విద్య, ఇతర సౌకర్యాలు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్టేట్ హోం సిబ్బందికి సూచించారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top