‘బ్లాక్‌మార్కెట్‌కు బాలామృతం’పై సమగ్ర విచారణ

Minister Satyavathi Rathod Outraged Over Balamrutham For Black Market - Sakshi

సాక్షి, ఎఫెక్ట్‌ : బాలామృతం పక్కదారిపై మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆగ్రహం

నివేదిక ఇవ్వాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు

అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీల్లో చిన్నారులకు అందించే బాలామృతం పంపిణీలో అక్రమాలు జరుగుతున్న తీరుపై ‘బ్లాక్‌మార్కెట్‌కు బాలామృతం’ అనే శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు. చిన్నారులకు పంపిణీ చేసే బాలామృతం కవర్లు పొలాల్లో కుప్పలుగా దొరకడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిణీ ఎలా జరుగుతుందనే అంశంపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జగదీశ్వర్‌ను ఆదేశించారు. 

దీంతో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారిని విచారణ అధికారులుగా ఆయన నియమించారు. బాలామృతం ప్యాకెట్లు పంపిణీ జరిగిన తీరు, వినియోగంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. రైతు పొలంలో కుప్పలుగా ఉన్న ప్యాకెట్లు ఎక్కడివో కూడా పరిశీలించాలన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పంపిణీ, లబ్ధిదారులు, వినియోగం తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో అధికారులు సైతం హుటాహుటిన విచారణ క్రమాన్ని మొదలుపెట్టారు. మరోవైపు బాలామృతం పంపిణీపై నిఘా ఏర్పాటు చేయాలని, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. 

‘బాలామృతం పక్కదారి’పై ఆరా 
కేశంపేట: ‘బ్లాక్‌ మార్కెట్‌కు బాలామృతం’శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు స్పందించారు. హైదరాబాద్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్‌జేడీ) సునంద, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ మోతీ తదితరులు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రికార్డులను, బాలామృతంను పరిశీలించారు. 

అనంతరం లబ్ధిదారులు బాలామృతంను సక్రమంగా తీసుకెళ్తున్నారా లేదా అని చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆరా తీశారు. పొలంలో పడేసిన బాలామృతం ఖాళీ ప్యాకెట్లను పరిశీలించారు. ఎవరైనా బాలామృతం ప్యాకెట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్‌ కమ్లేకర్‌ నవీన్‌కుమార్, షాద్‌నగర్‌ ఐసీడీఎస్‌ సీడీపీఓ నాగమణి, సూపర్‌వైజర్లు పద్మ, విజయలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top