ఆర్థిక వ్యవస్థపై రోడ్డు ప్రమాదాల ప్రభావం

Minister Prashanth Reddy Attend Road Safety Awareness Seminar - Sakshi

రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు భద్రతపై నగర ప్రజలు అవగాహన కలిగి ఉండాలని రోడ్లు, రవాణా, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఖైరతాబాద్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ భవన్‌లో ‘రోడ్‌ సేఫ్టీ ఆడిట్‌ ఫర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ సేప్టీ’ పై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డిమాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదంలో 12 లక్షల మంది మరణిస్తున్నారని, 5 కోట్ల మంది గాయపడుతున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ పెద్దను కోల్పోవలసి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తగ్గుతున్న దేశ జీడీపీ..  
ప్రమాదాల వలనే 3 శాతం దేశ జీడీపీ తగ్గిపోతుందన్నారు. వాహనాలు నడిపే వ్యక్తి అజాగ్రత్త, సేఫ్టీపై అవగాహన లేకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రహదారి సౌకర్యం సరిగా లేని కారణంగా కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల విద్యలో  రోడ్డు భద్రతపై  సిలబస్ ప్రవేశపెట్టడం ద్వారా అవగాహన పెంచవచ్చన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో సెలబ్రెటీలు, ప్రముఖులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ప్రచారం చేయడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు.

నిబంధనలు కఠినంగా అమలు చేయాలి..
రోడ్డు భద్రత విషయంలో నిబంధనలను ప్రభుత్వం కఠినగా అమలు చేయాలని కోరారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు పొల్యూషన్‌ చెక్‌ చేసి వాహనాల కండిషన్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేయాలన్నారు. జాతీయ రహదారులపై అంబులెన్స్‌లు సంఖ్య పెంచాలన్నారు. బ్లాక్‌ స్పాట్‌లను ముందుగానే గుర్తించి వాటిని పూడిస్తే ప్రమాదాలు తగ్గుతాయని ఆర్‌అండ్‌బి అధికారులకు విజ్ఞప్తి చేశారు. లైసెన్స్‌ల మంజూరులో నిబంధనలు కఠినతరం చేయాలని కోరారు. లైసెన్స్‌లు ఇచ్చినప్పుడే రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రతపై అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి జానార్ధన్‌ రెడ్డి, అర్‌అండ్‌బి ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ గణపతి రెడ్డి, రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ డీజీపీ కృష్ణ ప్రసాద్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top