కల్వకుర్తి పథకాన్ని విస్తరిస్తాం | Minister Harish Rao at Nagar Karnool Water Convention | Sakshi
Sakshi News home page

కల్వకుర్తి పథకాన్ని విస్తరిస్తాం

Dec 14 2017 2:45 AM | Updated on Mar 18 2019 9:02 PM

Minister Harish Rao at Nagar Karnool Water Convention - Sakshi

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కేఎల్‌ఐ ప్రాజెక్టు వద్ద జల విజయయాత్రలో హరీశ్‌ రావు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికి సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోందని.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని(కేఎల్‌ఐ) మరింత విస్తరించి అప్పర్‌ ప్లాట్‌లోని అమ్రాబాద్‌కు సాగునీరు అందిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బుధవారం ఆయన పర్యటించారు. తెలకపల్లి మండలంలోని లక్నారంలో ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి చేపట్టిన జల విజయయాత్రను మంత్రి ప్రారంభించారు.  హరీశ్‌ రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలు  అభివృద్ధి నిరోధకులుగా మారారని, తప్పుడు కేసులతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని అన్నారు. రైతులకు సాగునీరు అందించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ మూడేళ్లలో విజయం సాధించిందని అన్నారు. 

కేఎల్‌ఐకి రూ.1300 కోట్లు 
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రూ.1300 కోట్లను ఒక్క కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పైనే ఖర్చు చేసినట్లు మంత్రి హరీశ్‌ వెల్లడించారు. గత బడ్జెట్‌లో ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించడం వల్లే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయి ప్రస్తుతం నీరందుతోందని అన్నారు.   ప్రాజెక్టులు పూర్తయ్యేలా వాటి వద్దే నిద్ర చేస్తూ హరీశ్‌రావు పనులను పరుగులెత్తిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు  అభినందించారు. నియోజకవర్గంలోని కల్వకుర్తి ఎత్తిపోతల కాల్వల వెంట రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జల విజయ యాత్రను చేపట్టినట్లు నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి  వివరించారు.  కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్మన్‌ బండారు భాస్కర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement