హరీశ్‌రావుకు త్రుటిలో తప్పిన ముప్పు!

Minister harish rao missed the threat - Sakshi

హెలికాప్టర్‌లో జిల్లాల్లో పర్యటించి వచ్చిన మంత్రి

     జడివానతో బేగంపేట ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు లభించని అనుమతి

     అలాగే గాలిలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్‌

     పదిహేను నిమిషాలకు సరిపడా మాత్రమే ఇంధనం ఉండడంతో ఆందోళన

     హకీంపేట సైనిక ఎయిర్‌పోర్టుకు మళ్లించిన పైలట్‌

     అక్కడ అనుమతి లేకున్నా ల్యాండింగ్‌.. సైనికాధికారుల అభ్యంతరం..

     అనివార్య పరిస్థితిని వివరించడంతో సమసిన వివాదం

సాక్షి, హైదరాబాద్‌: భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సోమవారం పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డా రు. వాతావరణం బాగా లేక ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు హెలికాప్టర్‌కు బేగంపేట విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అనుమతి ఇవ్వలేదు. దాంతో హెలికాప్టర్‌ గాలిలోనే చక్కర్లు కొట్టింది. అయితే అందులో కొంతసేపటికి మాత్రమే సరిపడా ఇంధనం ఉండడంతో తీవ్ర ఉద్విగ్నత నెలకొంది. చివరికి పైలట్‌ హెలికాప్టర్‌ను హైదరాబాద్‌ శివార్లలోని హకీంపేట సైనిక ఎయిర్‌పోర్టులో అనుమతి లేకున్నా బలవంతంగా ల్యాండ్‌ చేయడంతో ప్రమాదం తప్పింది. 

ప్రాజెక్టులను పరిశీలించి వస్తూ.. 
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆహ్వానం మేరకు.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో సోమవారం జరిగిన పలు ప్రాజెక్టు పనుల కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఇందుకోసం సోమవారం ఉదయం 8 గంటలకే హైదరాబాద్‌ నుంచి బయలుదేరేందుకు ఆయన సిద్ధమైనా.. ప్రభుత్వ అధీనంలోని హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. రోడ్డు మార్గంలో వెళ్లేందుకు సమ యం సరిపోదన్న ఉద్దేశంతో అద్దెపై బెంగళూ రు నుంచి ప్రైవేటు హెలికాప్టర్‌ను తెప్పించారు. ఆ హెలికాప్టర్‌ వచ్చాక మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన హరీశ్‌రావు.. పాలేరు, వెంకటాపురం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా.. చీకటి పడితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో భద్రాద్రిలోనే మంత్రి తుమ్మలను దింపి.. హైదరాబాద్‌కు బయలుదేరారు. 

వాతావరణం సహకరించక.. 
హరీశ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ సాయంత్రం 5.40 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. కానీ భారీ వర్షం కురుస్తుండడంతో.. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేదంటూ బేగంపేట ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) అనుమతి నిరాకరించింది. భారీ వర్షం కారణంగా కనీసం ఐదు వందల మీటర్ల దూరం కూడా కనిపించని స్థితిలో.. పైలట్‌ హెలికాప్టర్‌ను హకీంపేట విమానాశ్రయానికి మళ్లించారు. సైనిక అవసరాలు, సైనిక శిక్షణ విమానాల కోసం ప్రత్యేకించిన.. హకీంపేట విమానాశ్రయంలో గాంధీ జయంతి సెలవు సందర్భంగా సోమవారం ఏటీసీ మూసేసి ఉంది. దీంతో పైలట్‌ ఏటీసీని సంప్రదించలేకపోయారు. అటు బేగంపేట విమానాశ్రయంలో రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం లేదని హెచ్చరికలు వచ్చాయి. కానీ హెలికాప్టర్‌లో పది పదిహేను నిమిషాల పాటు మాత్రమే సరిపోయేలా ఇంధనం ఉంది. దీంతో పైలట్‌ విధిలేని పరిస్థితుల్లో ఏటీసీ అనుమతి లేకుండానే హకీంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్‌ను సురక్షితంగా దింపారు. 

సైనికాధికారుల అభ్యంతరం
అనుమతి లేకుండా హెలికాప్టర్‌ ఎలా దింపుతారంటూ హకీంపేట ఎయిర్‌పోర్టుకు చెందిన సైనికాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఇరువర్గాల మధ్య దాదాపు అర గంటపైనే వాదు లాట జరిగిందని సమాచారం. అయితే అనివార్య పరిస్థితిని పైలట్‌ వివరించడం, రాష్ట్ర మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వారు వెనక్కి తగ్గారని తెలిసింది. కాగా హరీశ్‌రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడడంతో ప్రభుత్వ వర్గాలు, అధికార పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top