క్షీరం.. కల్తీ మయం | milk sales with mix of paste | Sakshi
Sakshi News home page

క్షీరం.. కల్తీ మయం

Nov 25 2014 11:33 PM | Updated on Oct 16 2018 3:12 PM

జిల్లాలో పాలను కల్తీ చేసి విక్రయించడం పరిపాటిగా మారింది..

 జిల్లాలో పాలను కల్తీ చేసి విక్రయించడం పరిపాటిగా మారింది.. తాజాగా పాలు చిక్కగా ఉండేందుకు ఓ రకమైన పేస్టు కలుపుతూ మెదక్ పట్టణంలో ఓ  పాల వ్యాపారి ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. కిష్టాపూర్ గ్రామానికి చెందిన మలికె మల్లేశం కొంత కాలంగా మెదక్ పట్టణంలో పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజులుగా పట్టణంలోని 19వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ తక్కువ ధరకే చిక్కని పాలు వేస్తానని చెప్పి అక్కడి మహిళలను నమ్మించాడు.

కొంత మంది అతడి మాటలు నమ్మి పాలు తీసుకుంటున్నారు. కాని వాటని వేడి చేసిన తరువాత ముద్దగా మారడం.. ముట్టుకుంటే పెయింట్ అంటుకున్నట్లుగా ఉండటాన్ని గమనించారు. అంతేకాకుండా రెండు రోజులు గడిచినా అవి పాడు కాకపోవడంతో వారికి అనుమానం బలపడింది. ఆ పాలు తాగిన వారు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో విషయాన్ని కాలనీ వాసులు కౌన్సిలర్ సులోచన దృష్టికి తీసుకెళ్లారు. ఆమె మంగళవారం పాలు తీసుకువచ్చిన మల్లేశంను నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.

తాను రోజు విక్రయించే స్వచ్ఛమైన పాలతో పాటు కొన్ని నీళ్లు కలిపి దానికి గోబిందా అనే కంపెనీకి చెందిన పేస్టును వాడుతున్నట్లు తెలిపారు. కాగా మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్ సైతం సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని ఆరా తీయగా తనతో పాటు సిద్ధిరాములు, గంగారాంలు కూడా పేస్టు కలిపి పాలను విక్రయిస్తున్నారని మల్లేశం చెప్పాడు.  దీని వెనుక ఇంక ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలని మల్లేశంను స్థానిక పోలీసులకు అప్పగించారు.  

కల్తీ పాల ఘటన తెలుసుకున్న పుడ్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ సంగారెడ్డి నుంచి మెదక్‌కు వచ్చి పాలను పరిశీలించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ పాలలో వైట్ పేస్టు కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిగతా విషయాలను తెలుసుకోవడానికి వాటిలో నుంచి 500 మి.లీ. పాలను తీసుకుని వాటిని హైదరాబాద్ సమీపంలోని నాచారం వద్ద గల పాల నిర్ధారణ కేంద్రానికి పంపనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement