అర్ధరాత్రి రేవంత్‌రెడ్డి అరెస్టు..కాంగ్రెస్‌ నాయకుల నిరసన

Midnight Revantreddy Arrested .. Congress Leader Protest - Sakshi

నిరసనగా కాంగ్రెస్‌ నాయకుల రాస్తారోకోలు, ర్యాలీలు 

అరెస్టును ఖండించిన నాయకులు 

సాక్షి, దౌల్తాబాద్‌: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ మహాకూటమి అభ్యర్థి రేవంత్‌రెడ్డి అరెస్టుపై మండలంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. రేవంత్‌రెడ్డిని ప్రభుత్వం, అధికారులు కలిసి అరెస్టు చేయడం తగదని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. పోలీసులు రేవంత్‌రెడ్డి అరెస్టుకు ముందుగానే తెల్లవారుజామున వివిధ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకుని జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా మండలంలోని దేవర్‌ఫసల్‌వాద్‌లో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలో నిరసన చేపట్టి ర్యాలీ నిర్వహించారు.

కూటమి నాయకుల ముందస్తు అరెస్టు... 
కోస్గిలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాద సభను అడ్డుకుని నిరసన తెలుపుతామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పిలుపునివ్వడంతో, ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు మహాకూటమి నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.

ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఆయా గ్రామాల్లో ఉన్న మహాకూటమి నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో ఎంపీపీ నర్సింగ్‌భాన్‌సింగ్, వైస్‌ఎంపీపీ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకట్రాములు, నాయకులు నర్సప్ప, సత్యపాల్, మూతులరాజు తదితరులున్నారు. 

బొంరాస్‌పేట మండలంలో... 
బొంరాస్‌పేట: మండల కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు ముందస్తు ప్రణాళికలతో గ్రామాల వారీగా కాంగ్రెస్‌ నాయకులను ఇళ్ల వద్ద నుంచి అరెస్టు చేసి తీసుకొచ్చారు. అరెస్టు చేసిన నాయకులను బృందాలుగా విడదీసి దూరపు పోలీసుస్టేషన్‌లకు తరలించారు.

మండల కాంగ్రెస్‌ నాయకులు వెంకట్రాములుగౌడ్, బుక్క కలీమ్, రాంచంద్రారెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, భీమయ్యగౌడ్, నర్సిములుగౌడ్, మేర్గు వెంకటయ్య తదితరులను జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసుస్టేషన్‌కు తరలించగా మరికొందరిని ఇతర ఠాణాలకు తరలించి సాయంత్రం వరకు ఉంచారు. యువజన నాయకులు అర్షద్‌ తదితరులు అరెస్టులను ఖండించారు. బేషరతుగా కాంగ్రెస్‌నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

అరెస్టులతో విజయాన్ని ఆపలేరు... 
టీఆర్‌ఎస్‌ నాయకులు అధికార దాహంతో కాంగ్రెస్‌ నాయకులపై అరెస్టులు చేసి నియంతృత్వ ధోరణిని చూపుతున్నారని మండల కాంగ్రెస్‌ నాయకులు ఖండించారు. ఓటమి భయంతో టీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ నాయకులపై అప్రజాస్వామికంగా చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.  ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top