పేరుకే బదిలీ.. ఉన్నచోటే ఉద్యోగం

Medical department Officials Derided the transfer process - Sakshi

బదిలీ ప్రక్రియను అపహాస్యం చేసిన వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు 

ప్రభుత్వ ఆదేశాలకు తూట్లు... నిబంధనలకు విరుద్ధంగా అధికారుల తీరు 

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగంలో బదిలీలు సాధారణం. సాధారణ బదిలీల్లో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖలో కొంతమంది స్టాఫ్‌నర్సులకు స్థాన చలనం కలిగించారు. అయితే వారు కూడా బదిలీ చేసిన చోటకి వెళ్లి విధుల్లో చేరారు. కానీ, విధుల్లో చేరిన రెండు రోజులకే తిరిగి వారిని వెనక్కు పంపించేశారు. స్టాఫ్‌ నర్సులకు బదిలీ జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా పాత స్థానాల్లోనే ఉద్యోగ విధులు నిర్వర్తిస్తుండటం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. అదేమని అడిగితే పాతస్థానంలో కొత్తవారిని నియమించే వరకూ అక్కడే విధులు నిర్వర్తి్తంచాలని చెబుతున్న వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మొత్తంగా ప్రభుత్వ ఆదేశాలకు తూట్లు పొడిచి బదిలీల ప్రక్రియను అపహాస్యం చేశారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 187 మంది స్టాఫ్‌ నర్సులకు జూన్‌లో సాధారణ బదిలీలు జరిగాయి. వారి వినతుల మేరకు వేర్వేరు ప్రాంతాల్లో ఆ స్టాఫ్‌ నర్సులకు పోస్టింగ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. విధుల్లో చేరిన రెండు రోజులకే తిరిగి పాత స్థానాల్లోనే కొన్నాళ్లు పనిచేయాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. అలా ఏకంగా 150 మందిని వెనక్కు పంపించారు. బదిలీ చేసి ఇప్పటికి నాలుగు నెలలైనా పాత స్థానంలోనే వారిని కొనసాగిస్తున్నారు. తమను కొత్త స్థానంలోకి మార్చాలంటూ స్టాఫ్‌ నర్సులు ప్రతి రోజూ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ను వేడుకుంటున్నారు.  

కమిషనర్‌ ప్రతిపాదనను పట్టించుకోని ఉన్నతాధికారులు 
బదిలీ అయి తిరిగి వెనక్కి వచ్చిన స్టాఫ్‌ నర్సులు తమకు న్యాయం చేయాలని కోరుతూ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ శివప్రసాద్‌ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇదే విషయాన్ని కమిషనర్‌ ఉన్నతాధికారులకు విన్నవించినా కూడా ఆయన గోడును ఎవరూ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని నర్సులు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దృష్టికి కూడా తీసుకొచ్చినా సమస్య పరిష్కారం కాకపోవటంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత చోట సిబ్బంది కొరత ఉంటే ముందే ఆలోచించాలి లేదా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి గానీ బదిలీ అయ్యాక మళ్లీ పాతస్థానంలో పనిచేయించడం సరికాదని స్టాఫ్‌ నర్సులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని అవసరమైతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకూ విన్నవించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top