దేవాదాయశాఖలో చిత్రవిచిత్రాలు
పెద్ద దేవాలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడలో వింతలు
ఇష్టమున్నట్టు పరస్పర బదిలీలు, పోస్టింగులు
నిబంధనలకు విరుద్ధమైనా యథేచ్ఛగా అమలు
సాక్షి, హైదరాబాద్: దేవాలయాలను భక్తులు పవిత్రంగా భావిస్తారు. కానీ, ఆ దేవాలయాలను పర్యవేక్షించే శాఖలో మాత్రం లెక్కలేనన్ని అవకతవకలు. అధికారులకు నిబంధనలు పట్టవు, రూల్స్ పాటించరు, పైగా వాటిపై నేతల పెత్తనం. ప్రజాప్రతినిధులు బెదిరించి మరీ తోచినట్టు చేయిస్తారు. నిబంధనలకు అది విరుద్ధమైనా.. అధికారులు గుడ్డిగా ఆచరించేస్తారు. ఈ క్రమంలో అక్రమాలే కాకుండా, చిత్రవిచిత్ర విన్యాసాలూ చోటు చేసుకుంటుంటాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి –యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో ఉద్యోగుల పరస్పర బదిలీల్లో ఈ తరహా చిత్రాలు వేదికవుతున్నాయి. ఇద్దరు ఉద్యోగుల వ్యవహారంలో జరుగుతున్న తంతు దీనికి అద్దం పడుతోంది.
బదిలీలతో మొదలు...
దాదాపు ఏడాది క్రితం దేవాదాయ శాఖలో బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తేయటంతో 40 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేశారు. సాధారణంగా ఓ స్థాయి దేవాలయ ఉద్యోగులను అదే స్థాయి ఉన్న దేవాలయానికి మాత్రమే బదిలీ చేయాలని నిబంధన చెబుతోంది. అయినా కొంత సడలింపు ఇస్తూ.. రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి కార్యనిర్వహణాధికారిగా ఉండే వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం దేవాలయాల సరసన.. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి కార్యనిర్వహణాధికారిగా ఉండే కొమురవెల్లి, బాసర, కొండగట్టు దేవాలయాలను చేర్చి పరస్పర బదిలీలు జరిపారు.
పోస్టే లేకుండా పదోన్నతి...
వేములవాడ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏఈఓ) కేడర్‌లో ఉన్న ఓ ఉద్యోగిని యాదగిరిగుట్టకు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆయనకు తన సీనియారిటీ ఆధారంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) పదోన్నతి కల్పించారు. ఆయన మాతృ దేవాలయం వేములవాడ కావటంతో, ఆ దేవాలయంలో డీఈఓ పోస్టు ఖాళీ కావటంతో ఆయనకు పదోన్నతి కల్పించారు.
కానీ, ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న యాదగిరిగుట్ట దేవాలయంలో ఆ పోస్టు ఖాళీగా లేదు. దీంతో ఆయన్ను వెంటనే వేములవాడ దేవాలయానికి తిప్పి పంపాల్సి ఉంది. అదే ప్రయత్నం చేయబోగా, వేములవాడ ప్రాంత ప్రజాప్రతినిధి ఒకరు ఆయన్ను తిరిగి వేములవాడకు తీసుకురావొద్దని, గత ప్రభుత్వ హయాంలో పనిచేసినవారు అక్కడ ఉండొద్దు అన్న తరహాలో హుకుం జారీ చేశారు. దీంతో పోస్టు లేనప్పటికీ, ఆయన్ను యాదగిరిగుట్టలోనే కొనసాగిస్తున్నారు. పోస్టు లేని చోట జీతం ఇవ్వటం సాధ్యం కానందున, జీతం మాత్రం వేములవాడ దేవాలయ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. పోస్టు లేని చోట పనిచేయించటమే నిబంధనలకు విరుద్ధమంటే, పనిచేయని దేవాలయం నుంచి జీతాన్ని చెల్లిస్తుండటం మరో విరుద్ధ చర్య. అయినా, దర్జాగా అమలు చేసేస్తున్నారు.
ప్రమోషన్ సరే.. అమలేదీ?
వేములవాడకే చెందిన మరో సీనియర్ అసిస్టెంట్‌ను సైతం యాదగిరిగుట్టకు బదిలీ చేశారు. ఆయనకు వేములవాడలో సూపరింటెండెంట్ పోస్టు ఖాళీ కావటంతో సీనియారిటీ ఆధారంగా పదోన్నతి (పేపర్ ప్రమోషన్) కల్పించారు. కానీ, ఆయన పనిచేస్తున్న యాదగిరిగుట్ట దేవాలయంలో ఆ పోస్టు ఖాళీగా లేదు. దీంతో ఆయన పదోన్నతిని అమలులోకి తేలేదు. మొదటి ఉద్యోగికి పోస్టు లేకుండా ప్రమోషన్ ఇచ్చనా, ఈయన విషయంలో పదోన్నతి కల్పించినా అమలు చేయటం లేదు.
మరి వేములవాడకే తిప్పి పంపి పదోన్నతిని కల్పించే వీలున్నా... ఓ ప్రజాప్రతినిధి అడ్డుగా ఉండటంతో అది కుదరలేదు. ఇలాంటి విచిత్రాలు స్వయంగా దేవాదాయశాఖ పరిధిలోని పెద్ద దేవాలయాల్లోనే జరుగుతున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. విచిత్రమేంటంటే, కొద్ది కాలం క్రితమే యాదగిరిగుట్ట దేవాలయానికి ఐఏఎస్ అధికారిని కార్యనిర్వహణాధికారిగా నియమించారు. ఐఏఎస్ అధికారి ఉన్న దేవాలయంలోనే ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతుండటం విశేషం.


