‘నగర’ దరహాసం

Medchal District Devolopment - Sakshi

నగరీకరణ దిశగా మేడ్చల్‌ జిల్లా

ఎన్నో పరిశ్రమలకు కేంద్ర బిందువు

కొత్తగా నాలుగు కార్పొరేషన్లు 9 మున్సిపాలిటీలు

రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లు ఇక్కడే  

సాక్షి, మేడ్చల్‌జిల్లా: గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా నగరీకరణ దిశగా దూసుకెళుతోంది. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కూకట్‌పల్లి,  మల్కాజిగిరి, ఉప్పల్‌ నియోజకవర్గాలతో పాటు కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని సగ భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంది. దీనికి తొడు కొత్తగా నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్లు (నగరపాలక సంస్థలు), తొమ్మిది మున్సిపాలిటీలు ఏర్పడటంతో జిల్లా పూర్తిగా నగరీకరణను సంతరించుకోనుంది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి గ్రామ పంచాయతీలను వీలినం చేస్తూ నిజాంపేట్‌ మున్సిపాలిటిగా ప్రకటించిన ప్రభుత్వం.. ఈ మున్సిపాలిటీని మళ్లీ ‘కార్పొరేషన్‌’గా ప్రకటించింది. ఇదే నియోజకవర్గంలోని దుండిగల్, మల్లంపేట్, డీపీపల్లి, గాగిల్లాపూర్, బౌరంపేట్, బహుదూర్‌పల్లి గ్రామాలతో దుండిగల్‌ మున్సిపాలిటీ, కొంపల్లి, దూలపల్లి గ్రామ పంచాయతీలను కలిపి కొంపల్లి మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జవహార్‌నగర్‌ గ్రామ పంచాయతీని మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మార్చింది. చెంగిచెర్ల, బోడుప్పల్‌ గ్రామ పంచాయతీలను కలిపి బోడుప్పల్‌ కలిపి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేసింది. పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వాతాపూర్‌ పంచాయతీలను కలుపుతూ ఫీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేసింది. ఇదే మేడ్చల్‌ నియోజకవర్గంలో మేడ్చల్,అత్వేల్లి గ్రామ పంచాయతీలను కలుపుతూ  మేడ్చల్‌ మున్సిపాలిటీగా, ఘట్కేసర్, కొండాపూర్, ఎన్‌ఎఫ్‌సీనగర్‌ గ్రామాలను ఘట్కేసర్‌ మున్సిపాలిటీగా, పోచారం, ఇస్మాయిల్‌ఖాన్‌ గూడ, నారపల్లి, యన్నంపేట్‌ గ్రామాలను కలిపి పోచారం మున్సిపాలిటీగా ఏర్పడ్డాయి.

దమ్మాయిగూడ, అహ్మద్‌గూడ, కుందనపల్లి గ్రామాలను దమ్మాయిగూడ మున్సిపాలిటీగా, నాగారం, రాంపల్లి గ్రామాలను నాగారం మున్సిపాలిటీగా, గండ్లపోచంపల్లి, కండ్లకోయ, బాసిరేగడి, గౌరవెళ్లి, అర్కలగూడ గ్రామాలను కలిసి గండ్లపోచంపల్లి మున్సిపాలిటీగా, దేవరయాంజల్, ఉప్పరపల్లి గ్రామాలను తూముకుంట మున్సిపాలిటీగా ఆవిర్భవించాయి.  

అభివృద్ధికి వడివడిగా అడుగులు 
జిల్లాలో కొత్తగా నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలు ఏర్పడటంతో ఈ పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ పెరుగుదల ఉండగలదని భావిస్తున్నారు. అనుబంధ సేవా రంగం అభివృద్ధితో పాటు అనువుగా ఉన్న జాతీయ రహదారి, దాని సమీంపలోని ఔటర్‌ రింగ్‌ రోడ్, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ రోడ్ల విస్తరణతో నిర్మాణ రంగం దూసుకెళుతుందని ఇక్కడి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం జిల్లాలో ఇప్పటికే 63 భారీ పరిశ్రమలు, 23,961 సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న 3,30,055 మంది ఉద్యోగులు, కార్మికుల కుటుంబాల్లో 40 శాతం ఈ నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోనే నివాసముంటున్నారని తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా 783 వివిధ తరహా పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు ఉండటంతో కొత్తగా 46,356 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది. బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 360 ఎకరాల్లో  ఐటీఐఆర్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top