బాబాయ్‌ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత

Maruthi Rao Daughter Amrutha Pranay Press Meet In Miryalaguda - Sakshi

శ్మశానంలో నన్ను అడ్డుకోవడం సరికాదు

ఆస్తుల మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు

భర్త చనిపోతే ఆ బాధేంటో నాకు తెలుసు

సాక్షి, మిర్యాలగూడ : ‘మా నాన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఓ మనిషిని చంపగలిగినంతవాడు ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోను. మా నాన్న మారుతీరావు, బాబాయ్‌ శ్రవణ్‌ మధ్య గొడవలు ఉన్నాయి. నాన్నను బాబాయ్‌ రెండుసార్లు కొట్టినట్లు తెలిసింది. మా నాన్న ఆత్మహత్యకు కారణాలు నాకు తెలియదు. బహుశా ఒత్తిడి వల్లే నాన్న చనిపోయి ఉంటాడని అనుకోను. ఆస్తి తగాదాలే ఆత్మహత్యకు కారణం కావచ్చు. వీలునామాలో బాబాయ్‌ (శ్రవణ్‌) పేరు ఉంటే అనుమానం​ వస్తుందని పేరు తీయించేసి ఉండాలి’  అని మారుతీరావు కుమార్తె అమృతా ప్రణయ్‌ తెలిపారు. (అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు!)

అమృత సోమవారం మిర్యాలగూడలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత నాన్న.. నన్ను ఇంటికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు. అక్కడకు వెళ్లడం నాకిష్టం లేదు. ఇక నా గురించి అయితే నాన్న ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. చనిపోవడానికి వేరే కారణాలు కూడా కావొచ్చు. ప్రణయ్‌ని చంపారు అని తప్ప..మా మధ్య వేరే గొడవలు లేవు. ఈ కేసులో చట్టపరంగా నాన్నకు శిక్ష పడాలని కోరుకున్నాను. వాళ‍్ల ఆస్తుల గురించి నాకు అవసరం లేదు. వాటి మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. నేను బయటకు వచ్చాక వాళ్లు ఆస్తులు పంచుకున్నారు. ఆస్తి విషయంలో మా అమ్మకు బాబాయ్‌ నుంచి ప్రాణహాని ఉండచ్చొని నేను భావిస్తున్నాను. గతంలో పరువు విషయంలో మా నాన్నను బాబాయ్‌ చాలాసార్లు రెచ్చగొట్టాడు. ఇవాళ ఉదయం శ్మశానంలో నన్ను అడ్డుకోవడం సరికాదు. తండ్రి అనే నేను చూడటానికి వెళ్ళాను..నన్ను చూడనివలేదు. నన్ను అడ్డుకుంది కూడా బాబాయ్‌ వాళ్ల అమ్మాయి. (నిందితుడు, బాధితుడు మారుతీరావే)

పిల్లలు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. భర్త చనిపోతే ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. అందుకే  మా అమ్మను పరామర్శించడానికి వెళ్లాను. బాబు పుట్టాక అమ్మ ఒకసారి నా దగ్గరకు వచ్చింది. బాబును చూపించాలని కోరితే నేను నిరాకరించా.  నేను అయితే ప్రణయ్‌ కుటుంబాన్ని వదిలి అమ్మ దగ్గరకు వెళ్లను. ఒకవేళ ఆమె నా దగ్గరకు వస్తే ఆమె బాధ్యత తీసుకుంటాను. నా భర్త ప్రణయ్‌ చనిపోయినప్పుడు ఎలా ధైర్యంగా ఉన్నానో... ఇప్పుడు తండ్రి చనిపోయినా అంతే ధైర్యంగా ఉన్నాను.  ప్రాణం తీసినా, తీసుకున్నా అందరికీ బాధే’ అని అన్నారు. (మారుతిరావు ఆత్మహత్య)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top