ప్రాణం తీసిన విషవాయువు 

Man Dies With Poison Gas Rangareddy - Sakshi

పసుపు నిల్వ కోసం కలిపిన గుళికలతో తల్లీకొడుకుల అస్వస్థత

బాలుడు మృతి, తల్లి పరిస్థితి విషమం 

అనంతగిరి: పసుపు నిల్వకు వినియోగించే గుళికల వాసనతో అస్వస్థతకు గురై ఓ విద్యార్థి మృతి చెందాడు. ఇదే ఇన్‌ఫెక్షన్‌తో బాలుడి తల్లి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులు, స్థానికుల వివరాల ప్రకారం వికారాబాద్‌లోని బీటీఎస్‌ కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభాకర్‌రెడ్డి, భార్య అమ్రేషా, కూతురు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. రంజిత్‌రెడ్డి భృంగీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతుండేవాడు. ఈయన స్వగ్రామం వికారాబాద్‌ మండలం పీలారం. గ్రామంలో గతేడాది సాగు చేసిన పసుపు పంటను వికారాబాద్‌లోని ఇంట్లో నిల్వ ఉంచాడు. పసుపు పాడవకుండా గుళికలు కలిపాడు. ప్రభాకర్‌ రెడ్డి మంగళవారం పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాడు. రాత్రి ఇంటికి కూడా రాలేదు.

అయితే ఇంట్లో భార్య అమ్రేషా, కుమారుడు రంజిత్‌రెడ్డి ఉన్నారు. పసుపు నిల్వకు సంచుల్లో మందు గుళికలు వేశారు. గుళికలు వేసిన సంచులకు మూతసరిగా కట్టలేదు. దీంతో ఆ గుళికల వాసన ఇళ్లంతా వ్యాపించింది. ఈ మందు భోజనంలో కలిసిపోయింది. ఈ విషయం తెలియక తల్లీకొడుకులు సాయంత్రం భోజనం చేశారు. దీంతో మంగళవారం రాత్రంతా ఇద్దరు వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. అలాగే సృహతప్పి పడిపోయారు. బుధవారం ఉదయం 9 గంటలైనా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడాన్ని గమనించి స్థానికులు తలుపు కొట్టారు.

నీరసంగా ఉన్న అమ్రేషా తలుపు తీసి జరిగిన విషయం చెప్పింది. వారు వెంటనే అమ్రేషాతో పాటు కుమారుడు రంజిత్‌రెడ్డిని వికారాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. రంజిత్‌రెడ్డి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అమ్రేషా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. కాగా ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం వెళ్లగా ఘటన తెలియడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top