ఇవి పీఎంను నిర్ణయించే ఎన్నికలు

Malkajigiri Lok Sabha Congress candidate Revanth Reddy - Sakshi

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి  

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: ఈ ఎన్నికలు ముఖ్య మంత్రి కుర్చీ కోసం కాదని, ప్రధానమంత్రిని నిర్ణయించేందుకు జరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్‌ కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేయటానికి ముందు స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లా డారు. తాను పోటీలో ఉన్నానంటే సీఎం కేసీ ఆర్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నా రు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని, ఉప ప్రాంతీయ పార్టీల మధ్య కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏఐసీసీ అధినేత రాహుగాంధీ ప్రధాని అవుతారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవారిని గాలికి వదిలేసి, నమ్ముకున్నవారిని నట్టేట ముంచి ఎన్నికల్లో రూ.100 కోట్లు ఖర్చు చేసేవారికే కేసీఆర్‌ టికెట్లు కేటాయించారని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డి, సీతారాంనాయక్, వివేక్‌లకు టికెట్లు ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి దిక్కుతోచకుండా ఉందని, వారిప్పుడు బావిలో దూకాలా.. అని అన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి వేలంపాటలో కేటాయించారని, ఇలాంటి వాళ్లు ప్రజాసమస్యలపై ఎలా మాట్లాడగలరని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని, తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్‌ బలహీనపరుస్తున్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా రని ధ్వజమెత్తారు.

ఆనాడు ప్రతిపక్షం ఉండొ ద్దని చంద్రబాబు అనుకుంటే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉండేవారా... రాజశేఖర్‌రెడ్డి వద్దనుకుంటే.. చంద్రశేఖర్‌రావు ఉండేవారా... ఇందిరాగాంధీ అనుకుంటే.. వాజ్‌పేయి, అద్వానీ లాం టి వారు ఉండేవారా.. అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సభలో మాజీ ఎమ్మెల్యేలు కె.లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, నేతలు తోటకూరి జంగయ్యయాదవ్, ఉద్దమర్రి నర్సింహారెడ్డి, నందికంటి శ్రీధర్, మల్లేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు. అనంతరం మేడ్చల్‌ కలెక్టరేట్‌ వరకు రేవంత్‌ పార్టీ శ్రేణులతో భారీర్యాలీగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎంవీరెడ్డికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

నా గెలుపుకు సహకరించండి: రేవంత్‌
సాక్షి, హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు.  తన గెలుపుకు సహకరించాలని   ప్రజాగాయకుడు గద్దర్‌ను కోరారు.  ఆయన విజ్ఞప్తికి గద్దర్‌ కూడా సానుకూలంగా స్పందించారు. రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం గద్దర్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్‌ల రాచరిక పాలనకు చరమగీతం పాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గద్దరన్న ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. ప్రశ్నించే గొంతు లేకపోతే పేదలకు న్యాయం జరగదని, రాష్ట్రంలో అంబేడ్కర్‌ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. సీపీఐ, టీజేఎస్, గద్దర్, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావుల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top