ఇష్టం మీది...పుస్తకం మాది!

Mahatma Jyotiba Phule Started New Method To Develop Studies In Telangana - Sakshi

ఎంజేపీటీబీసీ గురుకుల సొసైటీ వినూత్న కార్యక్రమం

విద్యార్థుల్లో సామాజిక అంశాలపై అవగాహనకు ప్రత్యేకం

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎప్పుడూ పాఠ్యపుస్తకాలతో కుస్తీ పట్టడమే కాకుండా సామాజిక అంశాలు, చరిత్ర, కరెంట్‌ అఫైర్స్‌ తదితరాలు తెలుసుకునే వీలుగా ప్రతి గురుకులంలో గ్రంథాలయ అభివృద్ధికి ఉపక్రమించింది. విద్యార్థులు ఇష్టపడే పుస్తకాలను తెప్పించేందుకు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ట్రస్ట్‌తో అవగాహన కుదుర్చుకుంది. సొసైటీ పరిధిలో 251 గురుకుల పాఠశాలలు, 29 జూనియర్‌ కళాశాలలతో పాటు మరో డిగ్రీ కాలేజీ ఉంది. వీటి పరిధిలో 1.15లక్షల మంది విద్యార్థులున్నారు.

ఏ పుస్తకం అడిగినా ఓకే...
గురుకుల విద్యాలయాల లైబ్రరీల్లో ప్రస్తుతం ఉన్న పుస్తకాలతో పాటు అదనంగా తెప్పించేందుకు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ ప్రిన్స్‌పాళ్లకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. వీటిలో నచ్చిన పుస్తకాల జాబితాలను ఆయా ప్రిన్స్‌పాళ్లకు అందించారు. విద్యార్థుల ఆసక్తి, అభిరుచికి తగిన పుస్తకాల జాబితాలను వారే సొసైటీకి అందించాలి. అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు. సంస్కృతి, చరిత్ర, ప్రస్తుత అంశాలతో పాటు పోటీ పరీక్షలు, సివిల్‌ సర్వీసెస్‌ తదితర రంగాలకు చెందిన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో ఉంచుతున్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి.

అవసరాలకు తగ్గ కొనుగోలు
ప్రతి గురుకుల విద్యా సంస్థలో ఒక గ్రంథాలయం ఉంది. ప్రస్తుతం కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉండగా.. విద్యార్థుల ఆసక్తికి తగిన పుస్తకాలు కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది. విద్యార్థులు ఏయే పుస్తకాలు కోరారో.. వాటిని హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ సొసైటీకి జాబితా ఇస్తాం. గరిష్టంగా 50% రాయితీపై వారు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. పుస్తకాల కొనుగోలుకు గురుకుల విద్యా సంస్థకు రాష్ట్ర కార్యాలయం నుంచే అనుమతులిస్తున్నాం.– మల్లయ్య భట్టు,కార్యదర్శి, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top