సారూ.. మమ్మల్ని తెలంగాణలో కలపండి..!

Maharashtra Farmers Appeal to KCR To Get The Benefits Of Rythu Bandhu Scheme - Sakshi

కేసీఆర్‌కు మహారాష్ట్ర రైతుల లేఖ

సాక్షి, ముంబై : తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆయా గ్రామాల ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం పట్ల ఆకర్షితులైన మహా రైతులు ఈ అభ్యర్థన చేసినట్లు తెలుస్తోంది. దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్‌.. రైతులకు పెట్టుబడి కోసం ఏడాదికి ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున అందిస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొం‍దేందుకు వీలుగా తమ తాలుకాలోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలంటూ నాందేడ్‌ జిల్లాలోని ధర్మాబాద్‌ తాలుకా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు టీఆర్‌ఎస్‌ ఎంపీ కవితను కోరినట్లు సమాచారం.

నిజామాబాద్‌లో రైతు బంధు చెక్కుల పంపిణీ చేస్తున్న ఎంపీ కవితను కలిసిన బాబ్లీ గ్రామ సర్పంచ్‌ తమ సమస్యలను ఆమెకు వివరించారు. ఒక రాష్ట్రంలోని గ్రామాలను మరో రాష్ట్రంలో కలపడం అంత తేలికేమీ కాదని తమకు తెలిసినా ఇటువంటి రైతు సంక్షేమ పథకాలు పొందాలంటే మరో మార్గం కనిపించడం లేదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కేవలం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాల ప్రయోజనాలు పొందేందుకు మహా రైతులు చేసిన అభ్యర్థన అసంబద్ధంగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ, వ్యవసాయం కోసం 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు, రైతులకు 5 లక్షల జీవిత బీమా కల్పించడం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top