
సుజాతనగర్ (భద్రాద్రికొత్తగూడెం): ప్రేమికుడి నుంచి తనను దూరం చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోడ రాజమ్మ అనే యువతి చేపట్టిన దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు ఆమెను కలిసి.. దీక్షకు సంఘీభావం ప్రకటించారు. రాజమ్మకు న్యాయం చేయాలని, పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలని డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు బత్తుల వీరయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధీర్‌కుమార్, ఎస్టీ సెల్ నాయకులు పాల్గొని ఆమెకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
జిల్లాలోని ములకపల్లి మండలం మంచుపోసుగూడెం గ్రామానికి చెందిన బోడ రాజమ్మ(27)కు ఖమ్మంలో డిగ్రీ చదివే సమయంలో ఎల్. వెంకటేశ్వర్లు పరిచయమయ్యాడు. తన క్లాస్‌మేట్ అన్న అయిన అతనితో పరిచయం కాస్తా స్నేహంగా మారి ప్రేమగా పరిణమించింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంకటేశ్వర్లు చెప్పాడు.
సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం నెల్లూరులో ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే, అతని కుటుంబసభ్యులకు వీరి వ్యవహారం నచ్చలేదు. దీంతో ఇటీవల నెల్లూరు వెళ్లి వెంకటేశ్వర్లును తమతోపాటు ఎటో తీసుకెళ్లారు. అతడిని వెంటనే తనకు చూపాలంటూ రాజమ్మ గురువారం నుంచి సీతంపేట బంజర గ్రామంలోని అతడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. అయితే, ఆ ఇంట్లో ఎవరూ లేరు. తాళాలు వేసుకుని ఎటో వెళ్లిపోయారు. అయినా తనకు న్యాయం చేయలంటూ ఆ ఇంటి ముందే ఆమె బైఠాయించి.. ఆందోళన కొనసాగిస్తున్నారు.