బస్సెక్కేందుకు భయపడ్డరు

Lockdown Relaxations People Fear To Travel In RTC Bus In Telangana - Sakshi

తొలిరోజు తిరిగిన బస్సులు 51 శాతమే..

35 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు..

హైదరాబాద్‌కు వచ్చే బస్సుల్లోనే మోస్తరు రద్దీ

పల్లెలకు వెళ్లే బస్సులు బస్టాండ్‌ దాటని వైనం

కరోనాపై భయంతో బస్సులెక్కని జనం 

సాక్షి, హైదరాబాద్‌: జనంలో కరోనా భయం ఎక్కువగానే ఉంది. 56 రోజుల తరువాత బస్సులు రోడ్డెక్కినా.. అవెక్కడానికి ప్రయాణికులు సాహసించలేదు. లాక్‌డౌన్‌ మినహాయింపులతో ప్రారంభమైన బస్సులు తొలిరోజు ఖాళీగానే పరుగుపెట్టాయి. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బస్సులు తిరుగుతాయని సోమవారం రాత్రే చెప్పడంతో ఆ సమాచారం వేగంగానే ప్రజల్లోకి వెళ్లింది.

కానీ మంగళవారం బస్సులు బస్టాండ్లలోకి వచ్చినా.. ప్రయాణికులు రాలేదు. సాధారణంగా ఉదయం వేళ బస్టాండ్లు కిటకిటలాడుతుంటాయి. కానీ ఉదయం చాలా బస్టాండ్లలో ప్రయాణికుల కోసం సిబ్బంది ఎదురుచూడాల్సి వచ్చిం ది. కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట తదితర బస్టాం డ్లలో ఉదయం 8 గంటల ప్రాంతంలో మోస్తరు సంఖ్యలో ప్రయాణికులొచ్చారు. వారిలో ఎక్కువ మంది హైదరాబాద్‌ వెళ్లే బస్సులెక్కగా, గ్రామాల వైపు వెళ్లే బస్సులు చాలాసేపు బస్టాండ్లలోనే ఉండిపోయాయి.

6,153 బస్సులు తిప్పేందుకు సిద్ధం చేసుకోగా.. మంగళవారం సాయంత్రం కర్ఫ్యూ సమయానికి 3,179 బస్సులు మాత్రమే తిరిగాయి. కరీంనగర్‌ జోన్‌ పరిధిలో 1,585, ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో 510 సర్వీసులు నడిచాయి. నడపాల్సిన బస్సు ల్లో 51% వరకే తిరిగాయి. మం గళవారం సగటు ఆక్యుపెన్సీ 35%గా నమోదైంది. బస్సుల్లో నిలబడి ప్రయాణించటాన్ని నిషేధిస్తున్నట్టు సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. భౌతికదూరం పాటించేలా కొన్ని సీట్లను కూర్చోకుండా చేయాలన్న ఆలోచననూ విరమించుకుంది. కానీ.. మంగళవారం జనం లేక భౌతికదూరం పాటించినట్టయింది. 

కరోనాపై తగ్గని హైరానా
కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం, మన దేశంలో కేసులు లక్షకు మించిపోవటంతో జనంలో ఆందోళన నెలకొంది. లాక్‌డౌన్‌తో ఇన్ని రోజులు ఇళ్లకే పరిమితమైన జనం ఇతర వ్యాపకాలు పెద్దగా లేక కరోనాపై ఎక్కువగా చర్చించుకోవటం, టీవీల్లో ఎక్కువగా ఆ విషయాలే చూడ్డం వల్ల వారిలో ఆ భయం ఎక్కువ ఉందని మానసిక విశ్లేషకులు అంటున్నారు. దీంతో మంగళవారం బస్సు ప్రయాణమనేసరికి చాలామంది భయపడ్డట్టు స్పష్టమవుతోంది. ఇన్ని రోజులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుని, ఇప్పుడు ఇతరులతో కలిసి బస్సుల్లో వెళ్లటం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బస్సులతో పోలిస్తే ఆటోలు కొంతవరకు మంచిదనే భావన వారిలో వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ సహా అన్ని ప్రధాన పట్టణాల్లో మంగళవారం ఆటోల్లో ఎక్కువ మందే ప్రయాణించారు. తోటి ప్రయాణికులు లేకుండా విడిగా ఆటోల్లో వెళ్లేందుకు కొందరు మొగ్గుచూపారు. ‘ఇన్ని రోజుల తర్వాత బస్సులు ప్రారంభమైతే.. రద్దీ ఎక్కువుంటుందనుకున్నాం. కానీ, ఉదయం ఆరు గంటలకు బస్సులను బస్టాండ్లలో ఉంచితే ఎక్కేవారే లేరు. 9 తర్వాత గానీ పుంజుకోలేదు’అని ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రధాన బస్‌ డిపో మేనేజర్‌ ఒకరు పేర్కొన్నారు. మరో వారం పదిరోజులు పరిస్థితి ఇలాగే ఉండొచ్చన్నారు.

ఊళ్లలో కట్టుదిట్టం..
కరోనా విస్తరణ ప్రారంభమైనప్పటి నుంచి పల్లెలన్నీ ప్రత్యేక శ్రద్ధతో పైలంగా నడుచుకుంటున్నాయి. ఊళ్లలోకి కొత్తవారిని రానివ్వకుండా గ్రామస్తులు ముళ్లకంచెలు వేశారు. ఆ తర్వాత ఎవరైనా సిటీ నుంచి వస్తే వారిని క్వారంటైన్‌ చేయించారు. అలా జాగ్రత్తగా ఉన్న పల్లెల్లో బస్సులనగానే కొంత భయం మొదలైంది. సమీపంలోని పట్టణాలకు వెళ్తే క్వారంటైన్‌ చేస్తారంటూ సోమవారం కొన్ని ఊళ్లలో ప్రచారం జరిగినట్టు వార్తలొచ్చాయి.

అలాగే, బస్సుల్లో తిరిగితే ఇతర ప్రయాణికులతో ముప్పు ఉంటుందని, ఒకరికి వ్యాధి సోకినా ఊరంతా ఇబ్బందిపడాలని సర్పంచ్‌లు కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. సొంత వాహనాలపై వెళ్లి పనిచూసుకుని రావాలని, బస్సులెక్కకూడదని కొందరు నిర్ణయించుకున్నారు. ‘మా గ్రామానికి రోజూ 20 సర్వీసులుంటాయి. మంగళవారం ఐదు బస్సులొచ్చాయి. అవన్నీ ఖాళీగా వచ్చి.. వెళ్లాయి. మా ఊళ్లో ఒక్కరూ ఎక్కలేదు’అని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్‌ గ్రామ వాసి వూడె పులీంద్రారెడ్డి చెప్పారు. 

హైదరాబాద్‌ అంటే హడల్‌..
ప్రస్తుతం పనులపై సమీపంలోని పట్టణాలకు వెళ్తే.. బయట భోజనం చేసే అవకాశం లేదు. హోటళ్లన్నీ ఇప్పటికీ మూసే ఉన్నాయి. దీంతో భోజనం చేసే వీల్లేకపోవటం కూడా ప్రయాణాలు తగ్గేందుకు ఓ కారణమైంది. కాగా, హైదరాబాద్‌ వైపు వచ్చే బస్సులెక్కే విషయంలో భిన్న వాతావరణం కనిపించింది. వరంగల్, కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లో హైదరాబాద్‌ వైపు తిరిగే బస్సుల్లోనే కాస్త ఎక్కువ ప్రయాణికులు కనిపించారు. అదే ఇతర పట్టణాలకు హైదరాబాద్‌ నుంచి బస్సులు ఖాళీగా వెళ్లాయి. సాధారణ రోజుల్లో నిత్యం హైదరాబాద్‌కు వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. అలా అత్యవసర పనులపై వచ్చే వారితో కొన్ని బస్సుల్లో మోస్తరు రద్దీ కనిపించింది. కానీ, ఊళ్ల నుంచి సిటీకి వచ్చే బస్సుల్లో మాత్రం జనమే లేరు. హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో జనం హైదరాబాద్‌ అంటేనే భయపడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top