4 విడతల్లో రుణమాఫీ

Loan waiver Amount in Four installments - Sakshi

రూ.25 వేల లోపుంటే ఒకేసారి మాఫీ 

మార్గదర్శకాలు జారీచేసిన వ్యవసాయ శాఖ 

చెక్కుల రూపంలో రైతులకు సొమ్ము అందజేత 

సాక్షి, హైదరాబాద్‌: వడ్డీతో సహా రూ.లక్ష వరకు ఉన్న వ్యవసాయ పంటల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. గతంలోలాగే ఈసారి కూడా నాలుగు విడతల్లో రుణమాఫీ అమలు చేయనుంది. వ్యవసాయ రుణమాఫీ పథకం–2018 అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వల్పకాలిక పంట రుణాలు, బంగారం తాకట్టుపై గ్రామీణ ప్రాంతా ల్లో తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీని వర్తింపజేసింది. కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయనున్నారు. దీని ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2018 డిసెంబర్‌ 11 వరకు రైతులు తీసుకున్న, రెన్యువల్‌ చేసుకున్న పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని రూ.లక్ష మించకుండా అర్హులైన వారందరికీ రుణమాఫీ వర్తింపజేయనున్నారు.

రైతులు పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని కొనుగోలు చేసే విధానానికి స్వస్తి చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ హామీకి అనుగుణం గా సంస్థాగత రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్న వారికి ఇది వర్తించదు. రైతు కుటుంబం అంటే భర్త, భార్య వారి మీద ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. రూ.లక్షలో ప్రాసెసింగ్‌ ఫీజు, లీగల్‌ చార్జీలు, ఇన్సూరెన్స్‌ వంటివి ఉండవు. ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విధంగా రూ.25 వేల వరకు ఉన్న పంట రుణాలు తీసుకున్న రైతులకు ఒకే దశలో మాఫీ చేస్తారు. మిగతా రైతులకు మిగిలిన మొత్తాన్ని 4 దశలుగా మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రుణమాఫీ సొమ్మును రైతులకు చెక్కుల రూపంలో చెల్లించనున్నారు. 

రైతుల జాబితాల తయారీ ఇలా.. 
- 2018 డిసెంబర్‌ 11 నాటికి స్వల్పకాలిక పంట రుణా లు బకాయిపడిన రైతుల జాబితాల (ఏ–లిస్టు)ను గ్రామాల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో ప్రతి రుణ సంస్థ (బ్యాంకు) బ్రాంచీ తయారు చేయాలి. 
- బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాల మాఫీ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తించనుంది. 2018 డిసెంబర్‌ 11 నాటికి ఇలాంటి రుణ బకాయిలు కలిగిన రైతుల జాబితాల (బీ–లిస్టు)ను ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో గ్రామాల వారీగా ప్రతి బ్యాంకు తయారు చేయాలి. 
- బంగారం తాకట్టుపెట్టి అర్బన్, మెట్రోపాలిటన్‌ బ్యాంకులు/బ్యాంకు బ్రాంచీల నుంచి తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తించదు. అయితే అర్బన్, మెట్రోపాలిటన్‌ బ్యాంకులకు సంబంధించిన గ్రామీణ బ్రాంచీల నుంచి బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తించనుంది. 
- స్వల్పకాలిక పంట రుణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన రైతుల జాబితాలను బ్యాంకు బ్రాంచీల మేనేజర్లు పోల్చి చూసి రూ.లక్ష వరకు రుణ బకాయిలు కలిగిన రైతు తుది జాబితాల (సి–లిస్టు)ను నిర్దేశిత నమూనాలో రూపొందించాలి. స్వల్ప కాలిక పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితాలు, గ్రామీణ ప్రాంతాల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితాలు, తుది రైతుల జాబితాలను లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌తో పాటు జిల్లా కలెక్టర్లకు బ్రాంచీ మేనేజర్లు పంపాలి. 
- కొందరు ఒకటి కంటే ఎక్కువ బ్రాంచీల నుంచి పంట రుణాలు పొంది ఉంటారు. ఒక బ్యాంకుకు చెందిన వేర్వేరు బ్రాంచీలు లేదా ఇతర బ్యాంకుల బ్రాంచీల నుంచి రుణాలు పొంది ఉండొచ్చు. ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ వర్తించేలా నియంత్రించడంతో పాటు డూప్లికేషన్‌/మల్టీపుల్‌ ఫైనాన్సింగ్‌ నియంత్రణకు మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ (జేఎంఎల్‌బీసీ) సమావేశాన్ని నిర్వహించాలి. ఈ సమావేశంలో బ్యాంకర్లందరూ తమ బ్యాంకుల ఏ, బీ, సీ జాబితాలను తీసుకొచ్చి ఇతర బ్యాంకుల జాబితాలతో పోల్చి చూడాలి. అన్ని బ్రాం చీల తుది జాబితాలను మండల తహసీల్దార్‌ పరిశీలించి చూడాలి. నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారా? లేదా రుణ గ్రహీతలంతా వ్యవసాయ భూములు కలిగి ఉన్నారా? అన్న విషయాన్ని తహసీ ల్దార్‌ పరిశీలించి చూడాలి. పరిశీలన తర్వాత ఏవైనా తప్పుడు క్లెయిమ్స్‌ ఉంటే తొలగించాలి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు బ్రాంచీల నుంచి రుణా లు పొందిన రైతు కుటుంబ సభ్యులను జేఎంఎల్‌బీసీ కమిటీ సభ్యులు గుర్తించాలి. వారి జాబి తాల (డీ–లిస్టు)ను నిర్దేశిత నమూనాలో తయారు చేయాలి. జిల్లా సహకార ఆడిట్‌ అధికారి పర్యవేక్షణలో సహకార శాఖ ఆడిటర్లు ప్రాథమిక సహకార సంఘాలు, డీసీసీబీల ఏ, బీ, సీ జాబితాలను డీ జాబితాలతో పోల్చి చూడాలి. జిల్లా సహకార ఆడిట్‌ అధికారి తన పరిధిలోని మండలాలకు ఆడిటర్లను కేటాయించాలి. జిల్లాస్థాయి ఆడిట్‌ నివేదిక ఇవ్వాలి. జేఎంఎల్‌బీసీ రూపొందించిన డీ–జాబితాలను మండల స్థాయిలో అన్ని బ్యాంకుల బ్రాంచీలకు అందుబాటులో ఉంచాలి.  
- కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ బ్రాంచీల నుంచి రుణాలు తీసుకుని ఉంటే ఐటీ ఆధారంగా గుర్తించేందుకు బ్యాంకులు సమర్పించే తుది రైతుల జాబితా (సి–లిస్టు)ను విశ్లేషించి తుది డీ–జాబితాలను తయారు చేస్తారు. 
రైతులకు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని అప్పు ఖాతాలున్నా ఒక కుటుంబానికి ఒక లక్ష మేరకే రుణం మాఫీ చేయాలని నిర్ణయించారు. 
- కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పంట రుణానికి అర్హులైతే రూ. లక్ష మొత్తంలో ఉన్నవారందరికీ సమానంగా ఇస్తారు. 
- స్వల్పకాలిక పంట రుణాలు 18 నెలల చెల్లింపు కాల వ్యవధి ఉన్న వాటికే మాఫీ వర్తిస్తుంది. ఉద్యాన పంటల కోసం పొందిన స్వల్పకాల రుణాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. 
- రైతు కుటుంబాలను గుర్తించేందుకు ఏఈవో, వీఆర్‌వో, పంచాయతీ సెక్రటరీల సాయం తీసుకుంటారు. వీరికి మండల తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయాధికారి పర్యవేక్షకులుగా ఉంటారు. 
- తాత్కాలిక తుది జాబితా (జాబితా–ఈ)ను సంబంధిత గ్రామాలలో గ్రామసభ నిర్వహించి ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా సామాజిక ఆడిట్‌ నిర్వహిస్తారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత బ్రాంచ్‌ల వారీగా అర్హు్హలైన రైతుల తుది జాబితాను లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్, జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. 
- రైతుల వారీగా అర్హులైన వారి జాబితాను జిల్లాల్లో బ్యాంకర్ల మీటింగ్‌లో సమీక్షించి, రికార్డు చేసి దాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి పంపిస్తారు. అదే ఐటీ పోర్టల్‌లో ఆప్‌లోడ్‌ చేస్తారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తిరిగి బ్యాంకుల వారీగా రైతుల వారీగా చెల్లించాల్సిన మొత్తం వివరాలను, ప్రభుత్వం మంజూరు చేయాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తుంది.

అర్హుల గుర్తింపు ఇలా.. 
- మొదటి సారి మాఫీ చేసినప్పుడు తీసుకున్న కటాఫ్‌ తేదీ తర్వాత 2014 ఏప్రిల్‌ 01 నుంచి 2018 డిసెంబర్‌ 11 వరకు రైతులు తీసుకున్న, రెన్యువల్‌ పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని రూ.లక్ష మించకుండా మాఫీ చేస్తారు. 

వీటికి వర్తించదు.. 
- భాగస్వామ్య (టై అప్‌) రుణాలు 
- మూసేసిన పంట రుణాలు/రైటాఫ్‌ చేసిన రుణాలు 
- జాయింట్‌ లయబిలిటీ గ్రూప్‌ (జేఎల్‌జీ)/రైతు మిత్ర గ్రూప్‌ (ఆర్‌ఎంజీ)/లోన్‌ ఎలిజిబిలిటీ కార్డు (ఎల్‌ఈసీ)లకు ఇచ్చిన రుణాలు 
- రీస్ట్రక్చర్డ్‌/రీషెడ్యూల్డ్‌ రుణాలు 
- రుణమాఫీ ప్రయోజనం రైతులకు అందించేందుకు ఐటీ వ్యవస్థ లేదా పోర్టల్‌ను వ్యవసాయ శాఖ తయారు చేయాలి. రైతుల సమాచారం కోసం, వారి రుణాల మొత్తం వంటివి ఫైనల్‌ చేసేందుకు దీన్ని వినియోగించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top