టీఆర్‌టీ నియామకాలకు లైన్‌ క్లియర్‌

Line Clear For TS Teachers Recruitment Test Notification - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) అభ్యర్థులకు శుభవార్త. ఏళ్లుగా ఎదురు చూస్తోన్న ఉపాధ్యాయ నియామకాలకు లైన్‌ క్లియరైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ–2017 నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా అర్హత పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించినప్పటికీ కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో నియామకాల ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులు అప్పట్నుంచి ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం చేశారు. ఈక్రమంలో టీఎస్‌పీఎస్సీ అర్హుల జాబితాను పాఠశాల విద్యాశాఖకు సమర్పించింది. దీంతో నియామకాల ప్రక్రియ టీఎస్‌పీఎస్సీ నుంచి విద్యాశాఖకు చేరింది. ఎట్టకేలకు ప్రభుత్వం శనివారం స్పష్టత ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను నిబంధనలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేస్తూ జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఉమ్మడి జిల్లాలకు కమిటీలు
టీచర్ల నియామకాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసింది.  కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, వైస్‌ చైర్మన్‌గా జాయింట్‌ కలెక్టర్, కార్యదర్శిగా జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరిస్తారు. సభ్యులుగా జెడ్పీ సీఈవో, కొత్త జిల్లాల డీఈవోలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌/ మున్సిపాలిటీ కమిషనర్లు, జిల్లా షెడ్యూల్డ్‌ ఏరియా పరిధిలోకి వస్తే, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఉంటారు. ఇప్పటికే టీఆర్‌టీ ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ జిల్లా కమిటీలకు సమర్పించినట్లు సమాచారం. రోస్టర్, మెరిట్‌ ఆధారంగా త్వరగా నియామ కాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.   జిల్లా కమిటీలు తమ పరిధిలోని పాఠశాలల్లో సబ్జెక్టులవారీగా ఖాళీలను గుర్తించాల్సి ఉంది. కేటగిరీ 1,2,3,4 స్థానాలను సైతం నిర్ధారించాలి. ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం నియామకాలు చేపట్టాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top